
వేగంగా డబుల్ రోడ్డు పనులు
● రూ. 20 కోట్ల నిధులతో పనులు
అక్కన్నపేట మండలం అంతక్కపేట క్రాసింగ్ నుంచి తుది దశకు చేరుకున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండల ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డబుల్ రోడ్డు కల తీరనుంది. అక్కన్నపేట మండల అంతక్కపేట గ్రామ క్రాసింగ్ నుంచి కట్కూర్ గ్రామం మీదుగా రూ.20కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతక్కపేట క్రాసింగ్ నుంచి భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వరకు దాదాపు 11.5కిలోమీటర్ల మేర ఈ డబుల్ రోడ్డును నిర్మించనున్నారు. ప్రస్తుతం పనులు సగానికి పైగా పూర్తిగా కాగా డాంబర్ పోయడమే మిగిలి ఉంది.
తీరనున్న కల...
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తారు. ఇక్కడ ప్రతీ ఏటా మకర సంక్రాంతి సందర్భంగా జాతర జరుగుతుంది. దీంతో అక్కన్నపేట మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రోడ్డు ద్వారానే ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లపై వెళ్తుంటారు. డబుల్ రోడ్డు నిర్మించాలని గతంలో అనేకసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో తీసుకుని డబుల్ రోడ్డు విస్తరణ పనుల్ని చేపట్టారు.