
రాష్ట్రంలో దగాకోరు పాలన
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు పాలనలో ప్రజలు, రైతులు నరకయాతన పడుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేవలం 22 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో విసుగువచ్చిందన్నారు. యూరియా దొరకక రైతులు తమ పంటలను పశువులను మేపుతూ, దున్నేస్తున్నారని ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఎప్పుడు వస్తుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితులున్నాయంటే పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు సమస్యల కోసం ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు ధ్వంసమై బస్‌లు కూడా గ్రామా లకు రాని పరిస్థితి దాపురించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి..
సంక్షేమ హాస్టళ్లపై రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లలో దయనీయమైన పరిస్థితులు నెలకొనడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసి హాస్టళ్లల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.