
ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఏవీ?
సిద్దిపేటజోన్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రస్తుత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ, ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి ఎక్కడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేస్తున్న జాబ్‌మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విపంచి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు హారీశ్‌రావు హాజరై మాట్లాడారు. అంతకుముందు ట్రస్మా ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..యువత భవిష్యత్తు బాగుండాలనే జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఉద్యోగం కోసం ఊరు దాటితేనే ప్రపంచం గురించి అర్థం అవుతుందని చెప్పారు. విద్యార్థులకు విద్యతోపాటుగా సామాజిక నైతిక బాధ్యతను చిన్ననాటి నుంచే నేర్పించాలని సూచించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు అందించాలన్నారు. క్రీడలతో విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు. సిద్దిపేటలో అన్ని రకాల విద్య సంస్థలున్నాయని, వెటర్న రీ కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తరలించుకుపోయారని, మళ్లీ అధికారంలోకి రాగానే తిరిగి కళాశాలను ప్రారంభిస్తామన్నారు.
పనులు వేగవంతం చేయాలి
నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని హరీశ్‌రావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగిలో ఎదురైన సమస్యలు వానాకాలం పంటకు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ పారూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి: హరీశ్‌రావు
సిద్దిపేటరూరల్: ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని చింతమడక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు ఆవిష్కరించారు.
అనూహ్య స్పందన
ఈ సందర్భంగా నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు 2వేలకుపై చిలుకు నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. మహేంద్ర టెక్, రిలయన్స్, జీఎంఆర్, అమెజాన్, ఎయిర్ టెల్, ఎంఆర్‌ఎఫ్, పేటీఎం, డెలివరీ, ఐకియా, ఫ్లిప్కార్డ్, జుమోటో, జెప్టో, మిషో, బిగ్‌బాస్కెట్, డిమార్ట్, గ్లోబల్ సొల్యూషన్ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఏవీ?