
పత్తి కొనుగోళ్లకు కార్యాచరణ
10 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి అంచనా ఏర్పాట్లకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం
పత్తి కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధమవుతోంది. కలెక్టర్ రెండ్రోజుల కిందట దీనిపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 1.07లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగులోకి రాగా, ఈసారి 10లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
గజ్వేల్: మరో నెల రోజుల తర్వాత పత్తి మార్కెట్‌లోకి వచ్చే అవకాశముండగా...అధికార యంత్రాంగం కొనుగోళ్ల ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లాలో ఈసారి 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఈసారి పత్తి రైతులకు ఆది నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. సీజన్ ఆరంభంలో అనావృష్టి దెబ్బతీస్తే....ఆగస్టు నెల నుంచి అతివృష్టి అపార నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలోనే రోజుల తరబడి చేలల్లో వరద నిలిచి పంట ఎదుగుదల లోపించింది. తెగుళ్లు చుట్టుముట్టి పంట రంగు మారిపోయింది. కొనిచోట్ల కాత, పూత లేకుండా తయారయి..దిగుబడులపై ప్రభావం పడింది. మార్కెటింగ్ శాఖ మాత్రం ఈసారి ఎకరాకు 10క్వింటాళ్ల చొప్పున 10లక్షల క్వింటాళ్లకుపైగా ఉత్పత్తులు రావొచ్చని అంచనా వేస్తోంది.
జిల్లాలో 1.07 లక్షల ఎకరాలకుపైగా సాగు
గోదాములు సిద్ధం
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 63 గోదాములు పత్తి నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 1,59,150మెట్రిక్ టన్నుల పత్తిని నిల్వ చేసుకునే అవకాశముంది. ఈసారి ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించినందు వల్ల...సీసీఐ కేంద్రాల్లో ఈ ధరను పొందడానికి రైతులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఏఈఓలతో ఈ పంటను నమోదు చేయించుకుని, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు ఆధారంగా అమ్ముకోవాల్సి ఉంటుంది. పత్తి కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తహసీల్దార్, ఏఓ, ఎస్‌హెచ్‌ఓ(స్టేషన్ హౌజ్ ఆఫీసర్), మార్కెట్ కమిటీ కార్యదర్శి, సీసీఐ అధికారి, రైతు ప్రతినిధులతో కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. గతేడాది మాదిరిగానే జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, చిన్నకోడూర్, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హుస్నాబాద్, చేర్యాల మార్కెట్ కమిటీల పరిధిలో 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా మిల్లుల్లో రైతులకు కావాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లపై అధికారులు తనిఖీ చేయనున్నారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం
పత్తి కొనుగోళ్లపై ముంద స్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుంది. మరో నెల రోజుల తర్వాత పత్తి మార్కెట్‌లోకి వచ్చే అవకాశమున్నందున ఆలోగా కొనుగోళ్లకు సర్వం సిద్ధంగా ఉంటాం. – నాగరాజు,
సిద్దిపేట జిల్లా మార్కెటింగ్ అధికారి

పత్తి కొనుగోళ్లకు కార్యాచరణ