
భూ పంపిణీ అమలులో వైఫల్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాములు
సిద్దిపేట అర్బన్: రైతాంగ సాయుధ పోరాటం నాటి భూ ఎజెండాను పాలకులు నేటికీ పరిష్కరించకుండా నివాస, సాగు యోగ్యమైన భూమి లేని పేదలకు భూమిని పంచడంలో పూర్తిగా వైఫల్యం చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ అమరవీరుల సంస్మరణ సభ శుక్రవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..సాయుధ పోరాటం ఫలితంగానే భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందని, దాని వల్ల పేదల చేతుల్లో భూములున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్, ప్రశాంత్, నాయకులు కనకయ్య, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో
8 రెవెన్యూ క్లస్టర్లు
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలను 8 రెవెన్యూ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీపీఓలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తహసీల్దారు లక్ష్మారెడ్డి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాలనా సౌలభ్యం కోసం సమీపంలోని గ్రామాలను కలుపుతూ రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్–1, హుస్నాబాద్–2, తోటపల్లి, పోతారం(ఎస్)–3, మీర్జాపూర్, వంగరామయ్యపల్లి, భల్లునాయక్‌తండా–4, పందిల్ల, కూచనపెల్లి, మాలపల్లి–5, పొట్లపల్లి–6, మహ్మదాపూర్, మడద, రాములపల్లి, నాగారం–7, ఉమ్మాపూర్, జిల్లెలగడ్డ–8 గ్రామాలను రెవెన్యూ క్లస్టర్‌లోకి తీసుకున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.
వైద్య వృత్తి పవిత్రమైనది
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి
గజ్వేల్‌రూరల్: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆపత్కాలంలో మనిషి ప్రాణాలను కాపాడలిగేది వైద్యం మాత్రమేనని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శనివారం కోలా అభిరాం గార్డెన్స్‌లో జరిగిన ప్రగతి జూనియర్ కళాశాల ఎంపీహెచ్‌డబ్ల్యూ ప్రథమ సంవత్సర విద్యార్థినుల క్యాపింగ్ కార్యక్రమంలో యాదవరెడ్డి పాల్గొని మాట్లాడారు. రోగులు తొందరగా కోలుకునేలా వైద్యసేవలు అందించాలని, విద్యార్థినులు నర్సింగ్ వృత్తిలో రాణించి అందరి మన్ననలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మంజీ రా, ప్రగతి విద్యాసంస్థల కరస్పాండెంట్ అంబ దాస్, ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్ మట్టయ్య చౌదరిలతోపాటు సంధ్య పాల్గొన్నారు.
సీఎం హామీని అమలు చేయాలి
వీహెచ్‌పీఎస్ ఉమ్మడి జిల్లా
కో–ఆర్డినేటర్ దండు శంకర్
సిద్దిపేటరూరల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వీహెచ్‌పీఎస్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ దండు శంకర్ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ...వృద్ధులు, వితంతువులు, ఒంటరిమహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, దివ్యాంగులకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయని నేపథ్యంలో ఈనెల 15న పెన్షన్ దారులతో ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కస్తూరి రాజిరెడ్డి, సత్తయ్య, వేణు, జక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.

భూ పంపిణీ అమలులో వైఫల్యం

భూ పంపిణీ అమలులో వైఫల్యం