
చేపలు చేరేదెప్పుడు?
ఆలస్యమైతే ఎదుగుదలపై నీలినీడలు ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్ దాఖలు 16వ తేదీ వరకు కాంట్రాక్టర్ల ఫాంలను పరిశీలించనున్న అధికారులు
అదను దాటిపోయిందని ఆందోళన పడుతున్న మత్స్యకారులు
సాక్షి,సిద్దిపేట: చేప పిల్లల పంపిణీకి సంబంధించి అదను దాటిపోతున్నా ఇంకా టెండర్లు కూడా ఖరారు కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూలై–ఆగస్టు మధ్య కాలంలోనే చేప పిల్లలను వదలాల్సి ఉండగా, ఇప్పటివరకు పంపిణీకి సంబంధించిన ప్రక్రియే పూర్తి కాలేదు. దీంతో పలువురు మత్స్యకారులు సొంతంగానే చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లోకి వదులుతున్నారు. మరోవైపు చేపపిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానింగా కేవలం ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే బిడ్లు వేయడంతో చేపపిల్లలను ఎప్పుడు పంపిణీ చేసేది? ఎప్పుడు వదిలేది? ఎప్పుడు ఎదిగేది అని మత్స్యకారులు వాపోతున్నారు. చేపపిల్లల పంపిణీ కాంట్రాక్ట్‌లు ఇంకా టెండర్ ఖరారు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
జిల్లాలో 379 మత్స్యకార సొసైటీలు
జిల్లాలో 379 మత్స్యకార సొసైటీలు ఉండగా 24,517 మంది సభ్యులున్నారు. అందులో 40 మహిళా సొసైటీలు 1,975 సభ్యులు, పురుషుల సొసైటీలు 339 ఉండగా అందులో 22,442 మంది సభ్యులున్నారు. 2025–26 ఏడాదికి 1,715 చెరువుల్లో 4.42కోట్ల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. గత నెల 20 నుంచి ఈ నెల 1 వరకు టెండర్లను ఆహ్వానించగా ఎవరూ ముందుకురాకపోవడంతో రెండోసారి ఈనెల 8 వరకు ఆ తర్వాత మళ్లీ 12 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే బిడ్లు దాఖలు చేశారు.
దరఖాస్తుల పరిశీలన
ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులో పేర్కొన్నవాటిని, ఫాంలో చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయా?... సరఫరా చేసే సామర్థ్యం ఉందా అని అధికారులు పరిశీలించనున్నారు. ఇంకా 20 రోజుల ప్రక్రియ మిగిలి ఉంది. అంటే చేప పిల్లలు అక్టోబర్ నుంచి ప్రారంభమ య్యే అవకాశం ఉంటుంది. ప్రారంభమైన రోజు నుంచి అన్ని చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేయాలంటే 45 రోజులు సమయం పట్టనుంది. టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్లు సక్రమంగా పంపిణీ చేస్తారా? లేదా ? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎదుగుదల ఇలా...
ఫిబ్రవరి, మార్చి నాటికి చెరువులు ఎండుముఖం పడుతాయి. ఏప్రిల్ మే నెలలలో పూర్తిగా వట్టిబోయే అవకాశం ఉంటుంది. జాప్యం జరిగిన కొద్దీ చేపలు ఎదగక నష్టపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. బంగారు తీగరకం 8 నెలలకు, బొచ్చ 9 నుంచి 10 నెలల కాలం, రాహు సంవత్సరానికి 500 నుంచి 750గ్రామలు బరువు వస్తుందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే నాటివరకు చేపలు చేతికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
టెండర్లు ఖరారు కాగానే పంపిణీ
టెండర్లు ఖరారు కాగానే చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తాం. ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. కాంట్రాక్టర్ దాఖలు చేసిన ప్రకారం పరిశీలించి టెండర్లు ఖరారు చేస్తాం.
–మల్లేశం, ఎఫ్‌డీఓ
ఎదురు చూసి.. కొనుక్కుని
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ చెరువులో సొసైటీ సభ్యులు ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేస్తారని నెల రోజులుగా ఎదురు చూశారు. ఇంకా టెండర్ల ప్రక్రియనే కొనసాగుతుండటంతో చేప పిల్లలు వదిలే సమయం దాటిపోతుందని రూ.13 వేలతో చేప పిల్లలను తెచ్చి పోసుకున్నారు. ఇక చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యమైన చేపపిల్లల్ని తామే కొనుగోలు చేసి సరైన సమయంలో చెరువులు, కుంటల్లో వదులుకుంటామని పలువురు మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.

చేపలు చేరేదెప్పుడు?