
ఎవరు లీక్ చేస్తున్నారు?
కలెక్టరేట్‌లోని ఉన్నతాధికారి ఆరా
తప్పును కప్పిపుచ్చుకునేందుకు
సిబ్బందికి మెమోలు
సాక్షి, సిద్దిపేట: ఆఫీస్‌లో జరిగే విషయాలు బయటకు ఎలా వెళ్తున్నాయి? ఎవరు లీక్ చేస్తున్నారు? అనే అంశాలపై కలెక్టర్‌లోని ఉన్నతాధికారి ఆరాతీస్తున్నారు. ఈ నెల 7న ‘సాక్షి’ దినపత్రికలో దఫ్తర్‌లోనే బిస్తర్! అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం విదితమే. ఇలా పలు విషయాలు లీక్ చేస్తున్నారన్న కక్షతో కింది స్థాయి సిబ్బందికి మోమోలు ఇచ్చినట్లు వినికిడి. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీఎస్)పై ఒక పక్క ఈడీ విచారణ జరుగుతుండగానే అందులో నుంచి రూ.2లక్షలను సదరు అధికారి నేరుగా డ్రా చేశారు. గజ్వేల్ నియోజకర్గం పరిధిలోని ఓ మండల వైద్యశాలకు తనిఖీకి వెళ్లిన సమయంలో డాక్టర్‌తో సిగరేట్ డబ్బా తీసుకురావాలని హుకుం జారీ చేశారని తెలిసింది. ఎస్‌ఆర్‌డీఎస్ పథకం అమలు కావడంతో గొర్ల కాపర్ల అభివృద్ధిపై ఈ నెల 10న క్షేత్రస్థాయిలో పరిశీలన, సదస్సుకు జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లికి రాష్ట్ర గొర్రెల డెవలప్‌మెంట్ ఎండీ సుబ్బారాయుడు వచ్చారు. ఓ ఉన్నత స్థాయి అధికారి వచ్చినప్పుడు వెళ్లాల్సి ఉండగా.. వెళ్లకుండా.. సుబ్బారాయుడు పరిశీలన ముగిసిన తర్వాత తాపీగా గజ్వేల్‌కు చేరుకున్నారు. ఇలా అనేక తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి పలువురికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీఎన్జీవోస్, వైద్యులు, గొర్రెల కాపర్ల సంఘం నేతలు కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.