
మేధావులూ ఆలోచించండి
● నాడు సిద్దిపేట దేశంలోనే ఆదర్శం.. ● నేడు ఆగిన ప్రగతితో వెలవెల ● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: పదేళ్లుగా ప్రగతి పథంలో పయనించిన సిద్దిపేట.. రెండేళ్లుగా వెనుకబడిన ప్రక్రియపై మేధావులు, జర్నలిస్టులు ఆలోచించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో సిద్దిపేట దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు. అధికారులు సిద్దిపేటకు వచ్చి అధ్యయనం చేసేలా గొప్పగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఇబ్రహీంపూర్‌ను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు తిలకించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిటిష్ అంబాసిడర్ సైతం సిద్దిపేట స్వచ్ఛతను చూసి కితాబిచ్చారన్నారు. నాటి అభివృద్ధిని జర్నలిస్టులు విజయగాథలుగా అద్భుతంగా రాశారన్నారు. అదే సిద్దిపేట.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆగిన అభివృద్ధితో వెలవెల పోయిందన్నారు. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టులు, మేధావులు ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలో ఒక్క రూపాయి సిద్దిపేటకు రాలేదన్నారు. ఒక్క పని కూడా జరగలేదని వివరించారు.
జర్నలిస్టు జీవితం అంతా ఇబ్బందులతో ముడి పడి ఉంటుందన్నారు. వారి కష్టాలు వర్ణనాతీతమన్నా రు. కరోనా సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు రంగాచారి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.