
కలవని చేతులు
జిల్లాలో కాంగి‘రేసు’లో ఎవరికి వారే అనే విధంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీలో ఇంకా విభేదాలు సమసిపోవడం లేదు. ఓ వైపు పార్టీ అధిష్టానం కలిసికట్టుగా ముందుకు సాగాలనేసంకేతాలిస్తుంటే జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీచేసినట్లు, సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ నుంచివివరణ అడిగినట్లు పీసీసీ వర్గాల ద్వారా తెలిసింది. – సాక్షి, సిద్దిపేట
నర్సారెడ్డిపై విజయ్ ఫిర్యాదు
గజ్వేల్ పట్టణంలో ఆగస్టు 3న రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కాగా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఒకరి పై ఒకరు ధూషించుకున్నారు. దీనితో నర్సారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అలాగే వీరిద్దరు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి లకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో నర్సారెడ్డిని ఆదివారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలిచారు. ‘షోకాజు నోటీసులు జారీచేస్తున్నాం.. రాత పూర్వకంగా వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి’ అని చెప్పినట్లు తెలిసింది. దీనిపై నర్సారెడ్డిని వివరణ కోరగా నిజమని తెలిపారు.
హరికృష్ణను వివరణ కోరిన మల్లు
సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిలకు ఆరుగురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎంపీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ కోసం పని చేయకుండా క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయ్యారని, ఇటీవల ఇన్‌చార్జి మంత్రి మంజూరు చేసిన రూ.2 కోట్ల నిధులలో కమిషన్‌లు తీసుకున్నారని పలువురు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనితో మల్లు రవి స్పందించి వివరణ ఇవ్వాలని హరి కృష్ణను ఆదేశించారు. ఈ విషయం పై హరికృష్ణను వివరణ కోరగా ‘నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. వస్తే ఎందుకు వచ్చాయో అందరికీ తెలియజేస్తాను’ అని తెలిపారు.

కలవని చేతులు