
నిరుద్యోగులకు వరం ఉచిత కంప్యూటర్ శిక్షణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉచిత కంప్యూటర్ శిక్షణ నిరుద్యోగులకు వరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వేదాస్ సంస్థలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందిన 35 మంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికి ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఉచిత కంప్యూటర్ శిక్షణతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు రాణించాలన్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణలో ఉచిత వసతి, భోజనంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.
సేవాభావాన్ని అలవర్చుకోవాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు సమాజాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టాలని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ విద్యాసాగర్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆదివారం పెద్దకోడూరులో స్పెషల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపును ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీనరీ పెంచడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. సమాజం కోసం ఏవిదంగా పని చేయాలో వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో ముచ్చటించారు.
ఆత్మరక్షణకు
కరాటే దోహదం
జనగామ డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి
చేర్యాల(సిద్దిపేట): ఆత్మ రక్షణకు కరాటే తోడ్పడుతుందని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రేణుక గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు కరాటే బెల్టుల ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కరాటేలో పోటీల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కరాటే రాష్ట్ర అధ్యక్షుడు పాషా మాట్లాడుతూ కరాటేతో మానసిక, శారీరక, ఉన్నతితో పాటు ఉద్యోగాల్లో సైతం అవకాశాలుంటాయని అన్నారు. కరాటే మహిళలకు ఆత్మ రక్షణతో పాటు మనోధైర్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కరాటే జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, ప్రభాకర్, ఎల్లాగౌడ్, ఎల్లదాస్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడికి
షోకాజ్ నోటీసు
గజ్వేల్: పట్టణానికి చెందిన బీజేపీ క్రీయాశీలక నాయకుడు కాశమైన నవీన్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12న పట్టణంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు వద్ద పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించివేసి, అసభ్యపదజాలంతో దుర్భాషలాడినందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

నిరుద్యోగులకు వరం ఉచిత కంప్యూటర్ శిక్షణ

నిరుద్యోగులకు వరం ఉచిత కంప్యూటర్ శిక్షణ