
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులపై స్పందన వస్తుండటంతో ప్రజలకు ప్రజావాణిపై విశ్వాసం పెరుగుతోందన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 174 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, కలెక్టరేట్ ఏఓ రెహమన్ తదితరులు పాల్గొన్నారు.
ఖబ్రస్థాన్‌కు భూమిని కేటాయించండి
ఏడెకరాల ఖబ్రస్థాన్ భూమి కేటాయించాలంటూ మల్లన్నసాగర్ ముంపునకు గురైన ముస్లింలు కోరారు. ఈమేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ముంపునకు గురైన ఎర్రవల్లి, వేములఘాట్, లక్ష్మాపూర్, సంగారం గ్రామాలకు సంబంధించి ఏడు ఎకరాల ఖబ్రస్థాన్ భూమి పోయిందన్నారు. పునరావాసం, నష్టపరిహారం చెల్లించినా ఖబ్రస్థాన్‌కు భూమిని కేటాయించలేదన్నారు. భూమి లేకపోవడంతో 2019 నుంచి ఇబ్బందులు తప్పడంలేదన్నారు. తమకు అధికారులు స్థలాన్ని కేటాయించాలన్నారు.