
కాళేశ్వరంపై కుట్రలు సహించం
● బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ ● అమరవీరుల స్తూపానికి జలాభిషేకం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను సహించబోమని, కాంగ్రెస్ తీరుతో అమరవీరుల ఆత్మ గోషిస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిరసిస్తూ బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం ‘ఇది కదా కాళేశ్వరం’ అనే నినాదంతో రంగనాయకసాగర్ నుంచి బిందెలతో నీరు తెచ్చి, జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. అనంతరం రాజీవ్‌రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్వీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. ఉద్యమ సమయంలో జరిగిన కుట్రలే నేడు కాళేశ్వరంపై జరుగుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసీఆర్, హరీశ్‌రావులపై, కాళేశ్వరం పేరుతో సీబీఐ విచారణ చేయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల ముందు కావాలని బీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ నిందలు మోపుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 228 పిల్లర్లకు గాను మూడు పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా బీఆర్‌ఎస్ ను ఎదుర్కొనలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. రాస్తారోకో చేస్తున్న బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్వీ నాయకులను పోలీసులు పక్కకు తప్పించే క్రమంలో వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ దహనం చేసే క్రమంలో బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్వీ నాయకులకు ప్రమాదం తప్పింది. రాస్తారోకో సందర్భంగా రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఫ్లెక్సీ దహనంలో తప్పిన ప్రమాదం
ఫ్లెక్సీ దహనంలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణను నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రంగధంపల్లి చౌరస్తాలో రాస్తారోకో, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పలువురు నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే మంటలను ఆర్పివేశారు.