
పంట నష్టం లెక్కపక్కాగా..
రెండోసారి పరిశీలనకు వ్యవసాయశాఖకు ప్రభుత్వం ఆదేశాలు
భారీ వర్షాల వల్ల చోటుచేసుకున్న పంట నష్టాన్ని మరోసారి పక్కాగా అంచనా వేయాలని ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు సంబంధిత అధికారులు బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరిపి నష్టం అంచనా వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో 7,759ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలో తేలింది. రెండోసారి జరపనున్న పరిశీలనలో పంట నష్టంపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది.
గజ్వేల్: జిల్లాలో ఇప్పటి వరకు 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షల ఎకరాలు, మొక్కజొన్న 27,820, కంది 6594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగవుతోంది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈసారి భారీ వర్షాలు రైతాంగాన్ని కుదేలు చేశాయి. సీజన్ ఆరంభంలో అనావృష్టి నష్టాలు పాలుచేస్తే.. తాజాగా పంటలు ఏపుగా పెరుగు తున్న సమయంలో అతివృష్టి రైతులను కష్టాల్లోకి నెట్టేసింది.
ఆశలపై నీళ్లు..
భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. తెరిపి లేకుండా కురవడం వల్ల పంటలకు అపార నష్టం సంభవించింది. ప్రత్యేకించి వరికి తీవ్ర నష్టం కలిగింది. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. లోతట్టు చేలల్లో పత్తి నీటి మునిగి రంగుమారుతోంది. మరోవైపు తెగుళ్లు విజృంభించాయి. మొక్కజొన్న పంటకు సైతం భారీ నష్టం జరిగింది.
క్షేత్రస్థాయి పరిశీలనకు..
జిల్లాలో పంట నష్టాన్ని పక్కాగా తేల్చాలని, ఇందుకోసం రెండోసారి పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు బుధవారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు. పంట నష్టం జరిగిన గ్రామాల్లో రైతు వారీగా గణన చేయడానికి కార్యాచరణతో ముందుకుసాగనున్నారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి ధ్రువీకరించారు.
నేటి నుంచి క్షేత్రస్థాయిలోకి అధికారులు