
స్థానిక కసరత్తుముమ్మరం
నేడు ఓటరు జాబితా ప్రకటన
6న ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా
ఓటరు ముసాయిదా
10న తుది జాబితా విడుదల
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేసి మంగళవారం ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
–సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా 1,291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6న ఓటరు ముసాయిదాను ప్రదర్శించనున్నారు. ఈ నెల 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు. వాటిని 9వ తేదీ వరకు పరిష్కరించి 10న తుది జాబితాను వెల్లడించనున్నారు. జిల్లాలో జెడ్పీటీసీలు 26, ఎంపీటీసీలు 230 ఉన్నాయి.
వార్డుల వారీగా తుదిజాబితా
గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించనున్నారు. అగస్టు 28న ఓటరు ముసాయిదాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓటరు ముసాయిదా జాబితా పై 1,182 అభ్యంతరాలు రాగా వాటిని పరిష్కరించారు. మంగళవారం తుది జాబితాను విడుదల చే యనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశం ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 700 నుంచి 750 మంది ఓటర్లు ఉండే విధంగా చూడాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎంపీడీఓలకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పలు చోట్ల 400 ఓటర్లకు సైతం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఇతర కేంద్రాలకు తరలించే అవకాశం ఉందని సమాచారం.
ఏర్పాట్లు చేస్తున్నాం
ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు ముసాయిదా జాబితాలను సిద్ధం చేసి ఆయా గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నాం. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించి తుది జాబితాను ఈ నెల 10న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– రమేశ్, సీఈఓ, జిల్లా ప్రజాపరిషత్తు
గ్రామీణ మొత్తం ఓటర్లు: 6,55,958
మహిళలు: 3,34,186
పురుషులు: 3,21,766
ఇతరులు: 06
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం