
అందని యూరియా..ఆగని పోరు
జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సాగు చేసిన పంటలకు సమయానికి యూరియా అందకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి రోజంతా యూరియా కోసం బారులు తీరుతున్నారు. సోమవారం హుస్నాబాద్‌లో ఎరువుల దుకాణాల వద్ద యూరియా లేదంటూ బోర్డులు వెలియడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. రెండు చోట్ల రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు కిలోమీటర్ల మేర స్తంభించాయి. వ్యవసాయ అధికారి వచ్చి యూరియా అందేలా చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అలాగే యూరియా వస్తుందని తెలిసి మద్దూరు మండల కేంద్రంలోని రేబర్తి సొసైటీ వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తీరా క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులకే టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పి మద్దూరు క్లస్టర్ పరిధిలోని రైతులకే టోకెన్లు ఇప్పించి యూరియా సరఫరా చేయించారు. కొండపాక, జగదేవ్‌పూర్‌లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రహదారులపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనలను విరమింపజేశారు.
–హుస్నాబాద్/మద్దూరు(హుస్నాబాద్)/కొండపాక(గజ్వేల్)/జగదేవ్‌పూర్
జిల్లాకు 2 వేల టన్నుల యూరియా కేటాయింపు
గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల కృషి ఫలితంగా జిల్లాకు 2వేల టన్నుల యూరియా వచ్చిందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. ఆదివారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే వెయ్యి టన్నుల యూరియా గజ్వేల్ రేక్ పాయింట్‌కు చేరిందన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొరత తలెత్తకుండా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అవసరం మేరకే రైతులు యూరియా కొనుగోలు చేయాని సూచించారు.
మద్దూరు: రేబర్తి సొసైటీ ఎదుట రైతులు బారులు