
మళ్లీ వానలు..
తప్పని ఇబ్బందులు
● పంటలకు తీరని నష్టం ● ఎర్రబడుతున్న పత్తిపంట
దుబ్బాక: వారం రోజులుగా భారీ వర్షాలతో ఇబ్బందులు పడిన జనం.. ఇంకా కోలుకోకముందే మళ్లీ వానలు కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు రోజుల విరామంతో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమై సోమవారం రోజంతా ముసురుపెట్టింది. పంటలకు తీరని నష్టం కలుగుతోంది.
పత్తి, మొక్కజొన్న పంటలు సైతం..
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నీరు నిలిచి పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి చేనులో నీరు నిల్వ ఉండటంతో ఎర్రబడి ఎదుగుదల లోపించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పుట్టెడు పెట్టుబడులు పెట్టామని తీరా పూత, కాయలు వస్తున్న సమయంతో అధిక వర్షాలతో పంటలకు నష్టం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎడతెరిపిలేని వానలు రైతన్నలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
పత్తి ఎర్రబడుతోంది
నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశాను. కలుపు తీసి మందులు కొట్టిన. తీరా వానలు కురుస్తుండటంతో నీరు నిలిచి పత్తి పంట ఎర్రగా మారుతోంది. పూత, కాయలు కాసే దశలో నష్టం ఏర్పడుతుంది. ఇప్పటికే పుట్టెడు పెట్టుబడులు పెట్టాం. –భూపతిరెడ్డి, రైతు