
‘బంధీ’తో స్నేహ బంధం
ప్రాణస్నేహితులను
చేసిన కిడ్నాప్ ఘటన..
దుబ్బాక: ఓ కిడ్నాప్ ఘటన ముగ్గురిని ప్రాణస్నేహితులను చేసింది. 34 ఏళ్ల క్రితం కిడ్నాప్ ఘటన జరిగినా ఆ ముగ్గురి మధ్య ప్రేమ నేటికీ చెక్కుచెదరలేదు. ఆ నాటి సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. 1991 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సీఎంగా నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఉన్నారు. పీపుల్స్‌వార్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ రోజుల్లో ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఓ రోజు ఫారూఖ్ తన చిన్ననాటి స్నేహితుడు సికిందర్ తో కలిసి స్కూటర్‌పై దుబ్బాకకు వస్తున్న క్రమంలో అప్పటి దుబ్బాక పీపుల్స్ వార్ దళం కమాండర్‌గా ఉన్న రామన్న ఫారూఖ్, సికిందర్‌లను కిడ్నాప్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్ జిల్లాకు చెందిన రామన్న ఉద్యమ రీత్యా దుబ్బాక ప్రాంతంలో పనిచేస్తుండగా అప్పటి వరకు వీరికి ఎలాంటి పరిచయంలేదు. కిడ్నాప్ అయినప్పుడే వీరికి రామన్న పరిచయం అయ్యాడు. ఆతర్వాత రామన్న పీపుల్స్‌వార్ పార్టీని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్సీ ఫారూక్, సికిందర్, రామన్నలు ప్రాణస్నేహితులయ్యారు. రామన్న ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అ కుటుంబానికి ఫారూఖ్ హుస్సేన్ చాలా సార్లు అండగా నిలిచారు. వీరు ముగ్గురు తరుచూ కలుస్తూ తమ కష్ట సుఖాలు పంచుకుంటూ ఆదర్శ స్నేహితులుగా నిలిచారు. ఏదేమైనా బంధీ లో పరిచయంలో ఈ ముగ్గురిని ప్రాణస్నేహితులను చేయడం విశేషం.