
100 అడుగుల దూరం
గజ్వేల్: మున్సిపాలిటీలను సమగ్ర పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం కొనసాగుతున్నది. తాజాగా శనివారం నాటికి ఈ కార్యక్రమం 62వ రోజుకు చేరుకుంది. పారిశుద్ధ్యం మొదలుకొని ఆస్తి పన్నుల అసెస్‌మెంట్, భువన్‌సర్వే, ట్రేడ్ లైసెన్స్‌లు తదితర అంశాలపై కార్యాచరణ కొనసాగుతున్నది. మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఈ కార్యక్రమాలను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. కానీ సిబ్బంది కొరత, ఇతర సమస్యలు కార్యక్రమం లక్ష్యానికి అవరోధంగా మారుతున్నాయి.
జిల్లాలో సిద్దిపేట మినహా గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పట్టణాలు 2012లో మేజర్ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా చేశారు. చేర్యాలను ఆరేళ్లక్రితం మున్సిపాలిటీగా మార్చారు. అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఆయా పట్టణాల్లో మెరుగైన పాలన అందుతుందని ప్రజలు భావించారు. కానీ పరిస్థితిలో ఏ మార్పు లేదు. పారిశుద్ధ్యం మొదలుకొని అన్ని అంశాల్లోనూ సమస్యలున్నా యి. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమా లు సక్రమంగా సాగటం లేదు. అంతేకాదు.. ఇంటి పన్నుల అసెస్‌మెంట్, ఇళ్ల అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపు, నల్లాల ఆన్‌లైన్, ట్రేడ్ లైసెన్స్‌లు, భువన్ సర్వే తదితర అంశాల్లో మెరుగైన సేవలు అందటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘100 రోజుల ప్రణాళిక’ కార్యక్రమం కొనసాగుతున్నది.
సెప్టెంబర్ 10 వరకు..
తాజాగా శనివారం నాటికి వంద రోజుల ప్రణాళిక కార్యాచరణ 62వ రోజుకు చేరుకున్నది. సెప్టెంబర్ 10వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో మున్సిపల్ ఉన్నతాధికారులు రోజువారీగా విశ్లేషిస్తున్నారు. రోజువారీగా చేపట్టే అంశాలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీల పనితీరును మదింపు చేస్తున్నారు. వెనుకబడుతున్న వాటికి తగు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అనుకున్న స్థాయిలో ఈ కార్యక్రమం ఫలితాలు కనిపించడం లేదు. సాధారణ స్థాయిలోనే కార్యాచరణ కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, ఇతర సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది.
ప్రహసనంగా
వంద రోజుల ప్రణాళిక
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
జిల్లాలోని మున్సిపాలిటీల
పరిస్థితిపై పరిశీలన

100 అడుగుల దూరం