రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో అనేకమంది విద్యకు దూరమవుతున్నారు. మరికొందరు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో హైదరాబాద్ రౌండ్ టేబుల్ ఎన్‌జీఓ సంస్థ ముందుకు వచ్చి వీఎస్‌టీ పరిశ్రమకు చెందిన రూ.5కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాల భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకోరావాలన్న లక్ష్యంతో పనులను మొదలుపెట్టారు. అయితే పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భవన నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి పేద విద్యార్థులు పడుతున్న కష్టాలను చూసి ఉన్నతాధికారులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరానికై నా పాఠశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


