పూర్తి స్థాయి కమిటీ లేనట్టేనా!
హుస్నాబాద్: కాకతీయుల కాలంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి యేట జరిగే జాతరకు వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణలోనే అతి పెద్ద ఎల్లమ్మ తల్లి విగ్రహం. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. హుస్నాబాద్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ జాతర వైశాఖ పౌర్ణమి మే 1 నుంచి జేష్ట్య పౌర్ణమి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు వైభ వంగా నిర్వహిస్తారు. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం, బోనాలు, పట్నాలతో జాతర జరుగనుంది.
కమిటీ వేయరా?
బీఆర్‌ఎస్ హయాంలో ఎల్లమ్మ దేవాలయ జాతర కమిటీ వేసి కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలికంగా ఉత్సవ కమిటీ వేసి చేతులు దులుపుకొన్నారు. జాతర ప్రారంభానికి 5 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈసారైన పూర్తి స్థాయి కమిటీ వేస్తారా? లేదా ఉత్సవ కమిటీతోనే మమా అనిపిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది కార్యకర్తలు ఆలయ కమిటీ అధ్యక్షుడితో పాటు ఽకమిటీ సభ్యుల పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా తాత్కాలిక ఉత్సవ కమిటీతో నెట్టుకొచ్చారు. ఈసారైనా పూర్తి స్థాయి కమిటీ వేసి ఎల్లమ్మ తల్లికి సేవ చేసే భాగ్యం కల్పించాలని కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
దాతల సహాయంతో అభివృద్ధి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అనివేటి మండపం పనుల నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు సాగుతూనే ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి దాతల సహాయమే తప్ప, దేవాదాయ శాఖ నుంచి నిధులు నామమాత్రమే. దాతల సహాయంతో 6 వ్యాపార సముదాయాలు, భక్తుల విడిది కోసం 5 గదులను నిర్మించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత నిధులతో చేపట్టిన పోచమ్మ దేవాలయ పునఃనిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే ఆలయ ఆవరణలో భక్తుల వసతి మండపాలు, కల్యాణ వేదిక కోసం మూడు అతి పెద్ద షెడ్డులు నిర్మిస్తున్నారు. జాతర సమయానికి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. ఈసారి రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని కల్యాణ మహోత్సవాన్ని నూతనంగా నిర్మిస్తున్న కల్యాణ వేదికలో నిర్వహించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.
వచ్చేనెల 1 నుంచి ఎల్లమ్మతల్లి జాతర ప్రారంభం
రెండేళ్లుగా ఉత్సవ కమిటీతోనే నెట్టుకొస్తున్న వైనం
మంత్రిని ప్రసన్నం చేసుకుంటున్న నాయకులు


