ప్రకృతి సంపద దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. అక్రమార్కులు దేనినీ వదలటం లేదు. ఒక పక్క చెట్ల నరికివేత, మరో పక్క మంజీరానది నుంచి కృత్రిమ ఇసుక తయారీ, అలాగే బండరాళ్ల విక్రయాలతో రెచ్చిపోతున్నారు. కానీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే చర్యలు తీసుకొంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలంలో రోజురోజుకు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపదను అందిన కాడికి దోచుకుంటున్నారు. చెట్లు, గుట్టలు, రాళ్లను అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
యథేచ్ఛగా విక్రయాలు
చెట్లను నరికి ఇటుక బట్టీల యాజజమాన్యాలకు విక్రయిస్తున్నారు. గుట్టల నుంచి రాత్రివేళల్లో జేసీబీల సహాయంతో మొరం తవ్వి లారీలలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బండరాళ్లను కటింగ్ చేస్తూ జోరుగా విక్రయిస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఈ దందా సాగిపోతోంది.
అధికారుల లోపమే..
చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే వారి మధ్య సమన్వయ లోపం ఉందని దాని వల్లే అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇటుక బట్టీలకు తరలించడానికి సిద్ధం చేసిన కట్టెలు
రెచ్చిపోతున్న అక్రమార్కులు
బండరాళ్లను పగలగొట్టి సంపాదన
చెట్లను నరికి కలప అక్రమ విక్రయాలు
పట్టించుకోని అధికారులు


