దుబ్బాక: మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో దొంగలు హల్‌చల్ చేశారు. బుధవారం రాత్రి నాలుగు ఆలయాల్లో హుండీల్లోని నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ధర్మాజీపేటలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారిపై ఉన్న బంగారు పుస్తెలు, మట్టెలు, రూ.7 వేల వరకు నగదు, పెద్దమ్మ ఆలయంలో పుస్తె, మట్టెలు, హుండీలోని నగదు, ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కు పుడక, అర తులం బంగారు నగ, గల్లా పెట్టెలోని నగదు, మడి ఎల్లయ్య ఆలయంలో రెండు పుస్తె మట్టెలు, హుండీలోని నగదును దొంగలు అపహరించారు. ఈ ఘటనలపై సీఐ రాజేష్‌కు కుల సంఘాల పెద్దలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. కాగా గతంలో సైతం ఈ ఆలయాల్లో దొంగతనాలు జరిగాయి. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రజలు కోరుతున్నారు.
నాలుగు ఆలయాల్లో చోరీ
బంగారు నగలు, నగదు అపహరణ


