జహీరాబాద్: రైతులు భూసారాన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్త రమేష్, భూసార నిపుణులు ఇ.స్వామిలు సూచించారు. గురువారం మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల కేవీకే ప్రాంగణంలో ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి రైతులకు అవగాహన కల్పించారు. నేలలో పోషకాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ, సమగ్ర పోషక నిర్వహణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి పరీక్షల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. పంట మార్పిడి, అంతర పంటలు వేసుకునే విధానం గురించి వివరించారు. అనంతరం రైతులకు భూసార పరీక్షల ఫలితాల కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతులు విష్ణువర్ధన్‌రెడ్డి, సంపత్, నర్సింహులు, స్వరూపమ్మ, శ్యామలమ్మ, సంగారెడ్డి, ప్రభు పాల్గొన్నారు.


