బాకీ వర్సెస్ ధోకా
● పోటాపోటీగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల నినాదాలు
● ఇరువర్గాలను అడ్డుకున్న పోలీసులు
సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో మంగళవారం ఇరుపార్టీల మధ్య కార్డుల పంపిణీ హైటెన్షన్‌కు దారి తీసింది. అధికార కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి బాకీ కార్డుల పేరిట బీఆర్‌ఎస్ పార్టీ తీసుకెళ్తుంది. మరోవైపు బీఆర్‌ఎస్ పదేళ్లుగా ప్రజలను ధోకా చేసిందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. దీంతో ఇరుపార్టీల కార్డుల పంపిణీ పోలీసుల రంగ ప్రవేశానికి దారి తీసి కొన్ని గంటల పాటు వార్డులో గందరగోళానికి తెర లేపింది. ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఇరువర్గాలను అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. స్థానిక 14వ వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, పార్టీ నాయకులు మహేందర్ ఆధ్వర్యంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ ధోకా కార్డుల పేరిట ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో అదే వార్డులో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల బకాయిల బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ క్రమంలో వార్డులో ఒక ప్రాంతంలో ఇరుపార్టీలు ఎదురెదురు పడటంతో ఒక్కసారిగా పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక దశలో ఇరు పార్టీల శ్రేణులు ముందుకు తోసుకుని ప్రయత్నం చేశారు. ఆయా పార్టీల నాయకులు కార్డులను చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సకాలంలో స్పందించి ఇరు పార్టీల నాయకులను అడ్డుకొని దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మిబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
ఒక్కొక్కరికి రూ.60వేలు బాకీ
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్కరికి రూ.60వేలు బకాయి పడిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నామని, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి పేర్కొన్నారు. 25 నెలలుగా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదని ధీమా వ్యక్తం చేశారు.
పదేళ్లుగా ప్రజలకు ధోకా..
గత బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్లు రాష్ట్ర ప్రజలను ధోకా చేసిందని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి బీఆర్‌ఎస్ విస్మరించిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను చెదరగొడుతున్న పోలీసులు
సిద్దిపేట వన్ టౌన్
సీఐ వాసుదేవరావు
ఇరువర్గాలకు చెందిన 30మందిపై కేసు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణం 14వ వార్డులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మంగళవారం జరిగిన ఘటనలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ ప్రదర్శన నిర్వహించిన ఇరు పార్టీలకు చెందిన 30మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇక ముందు ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసుల ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాకీ వర్సెస్ ధోకా


