బొలెరో ఢీకొని రైతు మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. రాయిలాపూర్ గ్రామానికి చెందిన రైతు మదాసు రామస్వామిగౌడ్(48) సోమవారం తన బైక్‌పై పొలం వద్దకు వెళ్లి పనులు ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాయిలాపూర్‌గేట్ పెట్రోల్‌పంప్ సమీపంలో జాతీయ రహదారిపై బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రామస్వామికి తీవ్రగాయాలయ్యాయి. 108లో హైదరాబాద్‌లోని పైవ్రేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనం ఢీకొని..
హవేళిఘణాపూర్(మెదక్): ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హవేళిఘణాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన పెద్ద వెంకయ్య(75) గ్రామ స్టేజీ వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.


