
మందకొడిగా దరఖాస్తులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మద్యం షాపులను దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు పోటీ పడుతుండటం సాధారణం. సిండికేట్‌గా మారి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటుంటారు. కానీ జిల్లాలోని నాలుగు మద్యం షాపులకు మాత్రం గురువారం వరకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. నారాయణఖేడ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మూడు షాపులకు, అందోల్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మరో షాపునకు ఇప్పటివరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నాలుగు మద్యం షాపులు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయి. కాగా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు శనివారంతో ముగియనుంది.
ఈసారి స్పందన అంతంతేనా?
మద్యం షాపుల కేటాయింపుల విషయంలో ఈసారి మద్యం వ్యాపారుల నుంచి ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదు. 2023తో పోల్చితే ఈసారి అంతంత మాత్రంగానే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ జిల్లాలో ఐదు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మద్యం షాపులున్నాయి. 2023లో నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో ఏకంగా 6,156 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఇప్పటివరకు 1,264 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు గడువు రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. చివరి రెండు రోజులైన శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎకై ్సజ్ అధికారులు ధీమాతో ఉన్నారు. అయితే 2023లో వచ్చిన స్థాయిలో ఈసారి అంతగా రాకపోవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అనుభవం ఉన్న వారితో కలిసి..
మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న వారితో కలిసి సిండికేటుగా మారి పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకునేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకునే వారు కూడా కొందరు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒకవేళ అదృష్టం వరించి వచ్చిన మద్యం షాపును నిర్వహించలేని పక్షంలో ఎవరికై నా లీజుకు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాగా తక్కువ సేల్స్ ఉండే మద్యం షాపులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న షాపులను కొనుక్కునేందుకు మద్యం సిండికేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు కూడా ఈసారి జిల్లాలోని మద్యం షాపులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవాలని భావిస్తున్నారు.
సిండికేటుగా మారి.. బల్క్‌గా దరఖాస్తులు
మద్యం వ్యాపారులంతా సిండికేటుగా మారి బల్క్‌గా దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే పెరిగిన ఈ ఫీజును ఈ వ్యాపారులు ఏమాత్రం లెక్క చేయరనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. బిల్లులు సకాలంలో రావనే భయంతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. వీరంతా ఇప్పుడు ఈ మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతారనే అంచనాలున్నాయి. పైగా ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఉండటంతో ఎలాగైనా మద్యం షాపులను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు.
ఒక్క దరఖాస్తు కూడా రాని మద్యం షాపులు నాలుగు
ఆశించిన స్థాయిలో మద్యం వ్యాపారుల నుంచి స్పందన కరవు
చివరి రెండు రోజుల్లో బల్క్‌గా వస్తాయనే ధీమాలో ఎకై ్సజ్ వర్గాలు
రేపటితో ముగియనున్న గడువు