‘బంద్‌కు సంపూర్ణ మద్దతు’ | - | Sakshi
Sakshi News home page

‘బంద్‌కు సంపూర్ణ మద్దతు’

Oct 18 2025 9:55 AM | Updated on Oct 18 2025 9:55 AM

‘బంద్‌కు సంపూర్ణ మద్దతు’

‘బంద్‌కు సంపూర్ణ మద్దతు’

నారాయణఖేడ్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకాశ్‌రాథోడ్‌, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు అలిగే జీవన్‌ కుమార్‌, ఖేడ్‌ నియోజకవర్గ భీమ్‌ ఆర్మీ అధ్యక్షుడు అనుముల తుకారాం, సీపీఐ జిల్లా నాయకులు చిరంజీవి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

బంద్‌కు ఎంపీ మద్దతు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు జహీరాబాదు ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ తెలిపారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: రఘునందన్‌రావు

జిన్నారం (పటాన్‌చెరు): క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. గుమ్మడిదల పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం రఘునందన్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...బీజేపీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బీసీ బంద్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి: బీసీ వర్గాల హక్కుల సాధన కోసం శనివారం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు తమ పార్టీ మద్దతు ప్రకటించిందనీ, జిల్లా ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్‌ అమలు కోసం రాష్ట్రవ్యాప్త బంద్‌ ఒక శాంతియుత నిరసన రూపమని, బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. బీసీల అభివృద్ధి కోసం ఇది ఒక ఆవశ్యక దశ అని పేర్కొన్నారు.

21న ఉమ్మడి జిల్లా రగ్బీ పోటీలకు ఎంపిక

నారాయణఖేడ్‌: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు పాఠశాల క్రీడా సమాఖ్య (ఎసీఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ఖేడ్‌లోని ఈ–తక్షిల పాఠశాల గ్రౌండ్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లాస్థాయి అండర్‌–19 రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 19 ఏళ్లలోపు వయస్సుగల బాలబాలికలు అర్హులన్నారు. పూర్తి సమాచారం కోసం 91772 41933, 99595 52635, 96660 44630 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

డ్రగ్స్‌ తయారు చేస్తే

కఠిన చర్యలే

జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారి రాము

సంగారెడ్డి: జిల్లాలో ఎక్కడైనా నిషేధిత మాదక ద్రవ్యాలు, ఉత్ప్రేరకాలైన డ్రగ్స్‌ తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారి రాము హెచ్చరించారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోపిక్‌ సబ్స్టేన్సెస్‌ వంటి డ్రగ్స్‌ తయారీ కార్యకలాపాలు ఉంటే టోల్‌ ఫ్రీ నం 180059 96969తోపాటు జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం ఇవ్వాలని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరి

ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రభు

కొండాపూర్‌(సంగారెడ్డి): ప్రతీ రైతు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రభు సూచించారు. మండల కేంద్రమైన కొండాపూర్‌లో పశువులకు పశువైద్య సిబ్బంది శుక్రవారం చేపట్టిన గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో వెటర్నరీ అధికారి వెంకటరమణారెడ్డితో ప్రభు పాల్గొని మాట్లాడారు. టీకాల కార్యక్రమం నవంబర్‌ 14వ తేదీ వరకు కొనసాగుతుందని పశు పోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తొగర్‌పల్లి కాంగ్రెస్‌ నాయకులు గౌరిరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పశువుల ఆస్పత్రిలో మందులను నిల్వచేసేందుకు గానూ రిఫ్రిజరేటర్‌ను బహుమతిగా అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement