
పూడికతీత పనులెప్పుడో!
● కాల్వల్లో పేరుకుపోయిన పూడిక ● ఉపాధి హామీలో పూడిక తీయాలంటున్న ఇరిగేషన్ అధికారులు ● రెండు శాఖల మధ్య కొరవడినసమన్వయం ● చెరువులన్నీ నిండినా ఆయకట్టుకునీరు అందని దుస్థితి
కంది(సంగారెడ్డి): చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలు నిండి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొంది. చెరువుల నుంచి ఆయకట్టుకు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఫీడర్ చానళ్లు (కాలువలు) పిచ్చి మొక్కలు,ముళ్ల చెట్లు వ్యర్థాలతో నిండి పోయాయి. పంటకు నీరందించే కాలువల్లో నిండిన పూడికను చాలా రోజుల నుంచి తొలగించకపోవడంతో నీరు పారేందుకు వీలు లేకుండా అధ్వానంగా మారాయి. దీంతో ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు
పంటల సాగుకు బోర్లపైనే ఆధార పడాల్సి వస్తుందని వాపోతున్నారు.
అప్పట్నుంచీ పట్టించుకోలేదు
గత ప్రభుత్వ హాయాంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల్లో పూడికను తొలగించి వదిలేశారు. కాలువలను ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో పలుచోట్ల ముళ్ల చెట్లు పెరిగి ఫీడర్ చానళ్లు అధ్వానంగా తయారయ్యాయి. గతంలో చెరువులు, కుంటలు, కాలువల నిర్వహణను ఇరిగేషన్ శాఖ పూర్తిస్థాయిలో చేపట్టంది. అయితే గత ఆరేళ్ల నుంచి ఫీడర్ చానళ్లలో ఏర్పడిన పూడికను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించాలని ఆదేశాలున్నప్పటికీ ఆశాఖ ద్వారా పనులు జరగడం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇతర పనులు చేపట్టడం వల్ల అక్కడక్కడ కాల్వలో ఏర్పడిన పూడికను తీసినా అది పూర్తిస్థాయిలో చేయలేదని ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు.
పూడికతో 50% కూడా నీరందని వైనం
జిల్లాలో1,741 చెరువులు, కుంటలు ఉండగా మొత్తం ఆయకట్టు 72,082 ఎకరాలు ఉంది. ప్రస్తుతం పలు చెరువులు, కుంటలు కాలువల్లో పూడిక నిండటంతో 50% నీరు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా సంబంధిత శాఖల అధికారులు స్పందించి కాల్వల్లో ఏర్పడిన పూడికను తొలగించి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పూడిక తొలగించాల్సి ఉంది
ఫీడర్ చానళ్లలో పూడిక ఏర్పడిన మాట వాస్తవమే. పూడికతీతకు నిధులు లేకపోవడంతో ఈ పనులను ఉపాధి హామీ శాఖకు అప్పగించారు. పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఇచ్చాం. ఆశాఖ అధికారులతో చర్చించి పూడికతీతకు చర్యలు తీసుకుంటాం.
– బాల గణేశ్, ఇరిగేషన్ డీఈ

పూడికతీత పనులెప్పుడో!