
సివిల్స్‌కు ఎంపికై తే దేశ సేవ చేయవచ్చు
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి: సివిల్ సర్వీస్ అనేది పరీక్ష మాత్రమే కాదని ఆ పరీక్షలు పాసయితే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రణాళికతో విశ్లేషణాత్మకంగా చదివితే గ్రామీణ విద్యార్థులు కూడా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. సూల్తాన్పూర్‌లోని జేఎన్టీయూ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు చౌటకూర్ మండలం తాడ్దాన్‌పల్లి, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంతోపాటు సుల్తా న్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం తాడ్దాన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సహజంగా ఉండే విశ్లేషణాత్మకతను మరింత మెరుగుపరచుకుంటే, వారు యూపీఎస్సీ, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో కూడా రాణించగలరని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న తేడాలు విద్యార్థుల లక్ష్యసాధనకు అడ్డంకిగా భావించవద్దని ధైర్యం చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి వెంటనే బిల్లులు చెల్లిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు
సంగారెడ్డి జోన్: జిల్లాలో చేపపిల్లల పంపిణి కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...చేప పిల్లల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన చేప పిల్లలనే చెరువుల్లో విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.