
ప్రారంభమైన ఉపాధి హామీ సభలు
30.96లక్షల పనుల కల్పన లక్ష్యం
సంగారెడ్డి జోన్: గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గుర్తించే గ్రామ సభలు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ప్రతీ ఏటా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి సభలు నిర్వహించి పనులు గుర్తించేవారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో సభలు నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఆలస్యంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి.
బడ్జెట్ తయారీకి ఆదేశాలు
వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులను గుర్తించడంతో పాటు కూలీల బడ్జెట్ తయారీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల సమక్షంలో ప్రజలతోపాటు రైతులకు ప్రయోజనాలు కల్పించే పనులను ఎంపిక చేయనున్నారు. సహజ వనరులతోపాటు వ్యవసాయ సంబంధిత, వ్యక్తిగత, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత గుర్తించాలని ఆదేశించారు. గత సంవత్సరంలో గుర్తించిన పనులతోపాటు చేపట్టిన పనుల వివరాలను సభలో చదువుతారు. ఉపాధి హామీలో జియోగ్రఫీకల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) యుక్తధార యాప్‌ను ఉపయోగించి పనులను ఎంపిక చేస్తారు. గతంలో చేపట్టిన పనులు పూర్తయిన తర్వాతే కొత్త పనులు చేపడతారు. పంచాయతీల వారీగా గుర్తించిన పనులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఉపాధి హామీలో చేపట్టే పనులు
ప్రజలతోపాటు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. పశువుల పెంపకానికి షెడ్ల నిర్మాణం, బయోగ్యాస్ ప్లాంట్, వ్యవసాయ పొలాలకు మట్టి రహదారులు నిర్మించడం, పండ్ల తోటల పెంపకం, నర్సరీల ఏర్పాటు, ఫామ్ పాండ్, ప్రభుత్వ భవనాలలో రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, నీటి నిల్వ గుంతలు, కందకాలు, బండరాళ్లతో చెక్ డ్యామ్, ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు వివిధ రకాల పనులు చేపట్టారు.
వచ్చే ఆర్థిక ఏడాదికి రూపకల్పన
గ్రామ పంచాయతీ తీర్మానాలతో ప్రణాళిక
కూలీల జీవనోపాధిపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల కోడ్ నేపథ్యంలో సభలు ఆలస్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30.96 లక్షల పనులు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 18 లక్షలకు పైగా పని దినాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పనులు కొనసాగుతాయి. జిల్లాలో 2.18 లక్షల జాబ్ కార్డులు ఉండగా 1.20లక్షల జాబ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి.