
ఎన్నికల కమిటీలో డీసీసీలకు అవకాశం
జోగిపేట(అందోల్): కొత్తగా ఎన్నికయ్యే డీసీసీ అధ్యక్షులకు ఎన్నికల కమిటీలో కూడా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు సిజరిట పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో డీసీసీ అధ్యక్షులు కేవలం సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలను సమీకరించడం జిల్లాకు మాత్రమే పరిమితమయ్యే వారని, కానీ ఈసారి వారి ప్రాధాన్యతను పెంచేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేల స్థానంలో టికెట్ కేటాయించే విషయంలో కూడా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కార్యకర్తల్లో నుంచే డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 50కిపైగా డీసీసీ అధ్యక్షుడి పదవి కోసం దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈనెల 18 వరకు దరఖాస్తులను స్వీకరించి సంగారెడ్డిలోనే ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీకి కేవలం ఆరుగురి పేర్లను మాత్రమే పంపుతామని, ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ఎంపిక చేస్తారన్నారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం కూడా అవసరమని వారిని కూడా రాజకీయంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ పరిశీలకులు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాష్ట్ర ఫెడ్కాన్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకురాలు సిజరిట