అందరివాడే.. అయినా బదిలీ | - | Sakshi
Sakshi News home page

అందరివాడే.. అయినా బదిలీ

Oct 17 2025 10:13 AM | Updated on Oct 17 2025 10:13 AM

అందరివాడే.. అయినా బదిలీ

అందరివాడే.. అయినా బదిలీ

రామచంద్రాపురం తహసీల్దార్‌ బదిలీపై జోరుగా చర్చ

రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం తహసీల్దార్‌ సంగ్రామ్‌రెడ్డి ఆకస్మిక బదిలీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్‌, ఉస్మాన్‌నగర్‌, కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెలలో రియల్‌ వ్యాపారం జోరుగా ఉండటంతో ప్రభుత్వ పెద్దల కన్ను ఈప్రాంతంపైనే ఉంటాయి. ప్రభుత్వం మారినా ప్రభుత్వానికి చెందిన ముఖ్యశాఖల అధికారుల బదిలీలు రాష్ట్రస్థాయి బడా నేతల కనుసైగల్లో జరగడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ప్రాంతంలో ఏ శాఖలోనైనా పోస్టింగ్‌ రావాలంటే రాజకీయ పలుకుబడిఉన్న అధికారులు మాత్రమే ఇక్కడకి వస్తారన్న ఆరోపణలున్నాయి. వచ్చిన తర్వాత వారి ఆగడాలకు అంతూపొంతు లేకుండా పోతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

వచ్చినప్పుడే వెళ్లిపోతారని...

రంగారెడ్డి జిల్లా నుంచి ఎన్నికల సమయంలో సంగ్రామ్‌రెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్నికల తర్వాత సంగ్రామ్‌ రెడ్డి బదిలీపై వెళ్తారని స్థానికులు, రెవెన్యూ సిబ్బంది అనుకున్నారు. కానీ, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు, బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సానుకూలంగా వ్యవరించారన్న సానుభూతితో బదిలీ కాకుండా అడ్డుకున్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. దీంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు వారనుకున్న విధంగా పనులు చేశారని రెవెన్యూ సిబ్బందే గుసగుసలాడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం సంగారెడ్డి ఆర్డీఓ బదిలీ అనంతరం సంగ్రామ్‌రెడ్డి సైతం బదిలీ కావచ్చని చాలామంది చర్చించుకున్నారు.

మంత్రికి ఫిర్యాదు చేసినా..

అదే విధంగా గత కొన్ని నెలల క్రితం తెల్లాపూర్‌ పరిధిలోని ఓ వెంచర్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఈ విషయాన్ని స్థానికులు ప్రధాన శాఖకు చెందిన మంత్రి దృష్టికి సమస్యను తీసుకుని పోయి విచారణ చేయాలని సదరు మంత్రికి లేఖ సైతం ఇచ్చారు. ఆ విషయంలో జిల్లా ఉన్నతాధికారలు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కొంతమంది అధికారులు, నేతల ఒత్తిడితో వాటిని పట్టించుకోలేదానే విమర్శలున్నాయి. వాటితో పాటు వివాదాస్పదమైన భూములలో తల దూరుస్తున్నారని సంగ్రామ్‌రెడ్డిపై గతంలో అనేక మార్లు స్థానికులు సైతం ఆరోపించారు. పెద్దల అండతో మరికొంతకాలం ఉంటారనుకున్న సదరు తహసీల్దార్‌పై జిల్లా ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసి అందరిని విస్మయానికి గురిచేశారు. ఇదిలా ఉండగా బదిలీకి గల కారణాలు తెలియక కార్యాలయ సిబ్బంది, పలువురు తలలు పట్టుకుంటున్నారు. మృదుస్వభావంతో కనిపించే సంగ్రామ్‌రెడ్డి బదిలీ స్థానికం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికై నా నిఘా అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement