
పండ్ల దిగుమతులు ఏటా పైపైకి..
2019–20లో రూ.14,137 కోట్ల విలువైన పండ్ల దిగుమతి
2024–25లో రూ.25,770 కోట్లకు చేరిన దిగుమతులు
2030 నాటికి రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా
మనదేశంలో ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నా ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు మన వాళ్లకు పరదేశి పండ్లపై మోజు పెరుగుతోంది. ఒకప్పుడు భారీ మాల్స్, సూపర్ మార్కెట్లకే పరిమితమైన విదేశీ పండ్లు ఇప్పుడు రోడ్ల వెంబడి దుకాణాలనూ ఆక్రమించాయి. దేశీయ పండ్లతో పోలిస్తే వీటి ధరలు కాస్త ఎక్కువే అయినా.. పోషకాలు అధికంగా ఉంటాయన్న ప్రచారం వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఫలితంగా వీటి అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
సాక్షి, అమరావతి: కరోనా తర్వాత పండ్ల వినియోగం పెరగ్గా.. విదేశీ పండ్లకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా కేవలం ఆరేళ్లలో దిగుమతుల విలువ 82 శాతం పెరిగింది. 1970 దశకంలోనే విదేశీ పండ్ల దిగుమతులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో యాపిల్స్, ఖర్జూర మాత్రమే విదేశాల నుంచి అతికొద్ది పరిమాణంలో దిగుమతి అయ్యేవి. స్వేచ్ఛా వాణిజ్యం అమలులోకి వచ్చాక 1991 నుంచి విదేశీ వస్తువులతోపాటు విదేశీ పండ్ల దిగుమతులు పెరిగాయి.
అప్పట్లో మెట్రో నగరాల్లో హై ఎండ్ సూపర్ మార్కెట్లలో మాత్రమే విదేశీ పండ్లు విక్రయించేవారు. 2015 తర్వాత నగరాలు, పట్టణ ప్రజల జీవన శైలిలో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2019లో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుణ్యమాని ఆరోగ్య అలవాట్లలో మార్పులు వచ్చి పండ్ల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. ఈ కారణంగా దేశీయంగా లభించే పండ్లతోపాటు విదేశీ పండ్ల వినియోగం పెరిగింది. ఫలితంగా విదేశీ పండ్ల దిగుమతుల విలువ రూ.వందల కోట్ల నుంచి రూ.వేల కోట్లకు చేరింది.
వివిధ దేశాల నుంచి.. వేర్వేరు పండ్లు
కశ్మిర్ యాపిల్‌కు అమెరికా, న్యూజిలాండ్, చిలీ, ఇరాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే యాపిల్ పోటీగా నిలుస్తోంది. న్యూజిలాండ్, ఇరాన్, ఇటలీ నుంచి కివీ పండ్లు, చిలీ, దక్షిణాఫ్రికా నుంచి ద్రాక్ష, చైనా, అమెరికా, బెల్జియం నుంచి పియర్స్, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా నుంచి ఖర్జూర, వియత్నాం, థాయ్‌లాండ్ నుంచి డ్రాగన్ ఫ్రూట్స్, యూరప్, అమెరికా దేశాల నుంచి బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ పండ్లను, న్యూజిలాండ్, కెన్యా, పెరూ, ఇండోనేషియా నుంచి అవకాడో, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్, ఇటలీ దేశాల నుంచి బత్తాయి, ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్ ఫ్రూట్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు.

ఆరేళ్లలో 82 శాతం పెరుగుదల
వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా) లెక్కల ప్రకారం జాతీయ స్థాయిలో తొలిసారి వాణిజ్యపరంగా 1991లో కేవలం రూ.120 కోట్ల విలువైన 40 వేల టన్నుల విదేశీ పండ్లను దిగుమతి చేసుకున్నారు. 2000–01 నాటికి రూ.480 కోట్ల విలువైన 1.20 లక్షల టన్నుల పండ్లు దిగుమతి చేసుకోగా.. 2010–11లో రూ.2,800 కోట్ల విలువైన 2.5 లక్షల టన్నుల పండ్లు దిగుమతి అయ్యాయి. 2015–16లో రూ.7,300 కోట్ల విలువైన 3.8 లక్షల టన్నుల పండ్లు దిగుమతి చేసుకున్నారు. 2019 తర్వాత విదేశీ పండ్ల దిగుమతులు అనూహ్యంగా పెరిగాయి.
2019–20లో రూ.14,137 కోట్ల విలువైన 5 లక్షల టన్నుల విదేశీ పండ్లను దిగుమతి చేసుకోగా.. 2024–25లో పండ్ల దిగుమతుల విలువ రూ.25,770 కోట్ల చేరింది. దిగుమతుల పరిమాణం 8.50 లక్షల టన్నులకు పెరిగింది. విలువపరంగా చూస్తే 82 శాతం పెరిగితే పరిమాణం పరంగా 65 శాతం పెరిగింది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పండ్లన్నీ దశాబ్ద కాలంగా దేశీయంగా ఉత్పత్తి అవుతున్నా దిగుమతులు తగ్గడం లేదు.
కారణాలివీ..
ఒకే రకం పండ్లు విదేశాల్లో ఏడాది పొడవునా లభ్యమవుతున్నాయి. మన దేశంలో వివిధ పండ్లు ఆయా సీజన్లలో మాత్రమే పండుతాయి. విదేశీ పండ్లు ఆఫ్ సీజన్‌లో సైతం లభ్యం కావడం, నాణ్యతకు ఢోకా లేకపోవడం, పోషక విలువలు ఎక్కువగా, రసాయన అవశేషాలు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల వాటిపై ఇక్కడి ప్రజలు మోజు పడుతున్నారు. విదేశీ పండ్లు వివిధ రంగుల్లో ఆకర్షణీయమైన ఆకృతుల్లో లభించడంతోపాటు రుచిలో వైవిధ్యంగా ఉండటం కూడా వాటిని మనవాళ్లు ఇష్టపడటానికి మరో కారణం. అంతేకాకుండా విదేశీ పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల వీటిని దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు.