ట్రాఫికర్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫికర్‌

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

మొయినాబాద్‌: స్థానికంగా ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై మొయినాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్య తీవ్రమైంది. రహదారికి ఇరు పక్కల వాణిజ్య సముదాయాలు(షాపులు) ఉన్నాయి. కానీ ఆ షాపుల ముందు మాత్రం సరైన పార్కింగ్‌ స్థలాలు లేవు. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సైతం యజమానులు చిన్న చిన్న బండి కొట్లు పెట్టడానికి అద్దెకు ఇస్తున్నారు. దీంతో షాపులకు, బండి కొట్ల వద్దకు వచ్చినవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపి వెళ్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. అదే విధంగా హిమాయత్‌నగర్‌ చౌరస్తా నుంచి అజీజ్‌నగర్‌ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్‌, టైల్స్‌ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుంది.

అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం

వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్‌ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌లపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. దీంతో రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, వ్యాపార సముదాయాల ముందు ఖాళీ స్థలం ఎంత ఉంది. పార్కింగ్‌ స్థలం ఉందా అనే విషయాలను మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ముందు ఉన్న స్థలాన్ని కబ్జాచేసి వాటిలో బండికొట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వారి వద్ద రోజు లెక్క అద్దెలు వసూలు చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. షాపుల ముందు అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. గత పదకొండు నెలలుగా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వీఐపీ రూట్‌ అయినా..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్‌–బీజాపూర్‌ రహదారిని వీఐపీ మూమెంట్‌ రూట్‌గా ప్రకటించారు. సీఎం కొడంగల్‌ వెళ్లాలంటే ఇదే రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా శాస న సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తన నియోజకవర్గం వికారాబాద్‌కు వెళ్లాలన్నా ఇదే రూట్‌లో వెళ్లాలి. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికా రాబాద్‌ వెళ్లి వస్తూ ఉంటారు. అందుకే పోలీసులు వీఐపీ మూమెంట్‌ రూట్‌గా ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవడం లేదు.

చలాన్లు వేయడమే విధి

ట్రాఫిక్‌ పోలీసులు మొయినాబాద్‌ మాత్రం ఫొటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యం ట్రాఫిక్‌ జాం అవుతున్నా ట్రాఫిక్‌ పోలీసులు క్లియర్‌ చేయకుండా రోడ్డు పక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ముందు పార్కింగ్‌ స్థలం లేక రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి వేలకు వేలు చలాన్లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ నిత్యం ట్రాఫిక్‌ జాం

షాపులు, హోటళ్ల ముందు లేని పార్కింగ్‌

రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

చర్యలు తీసుకుంటున్నాం

మొయినాబాద్‌లో షాపుల ముందు సామాన్లు పెట్టినా, బండికొట్లు పెట్టినా వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్‌ అధికారులకు తెలియజేశాం. మరోసారి తాఖీదులు ఇచ్చి స్పెషల్‌ డ్రైవ్‌ పెడతాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్‌ సమస్య వస్తుంది. ట్రాఫిక్‌ జాం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.

– సతీష్‌, ట్రాఫిక్‌ సీఐ, చేవెళ్ల

Advertisement
 
Advertisement
Advertisement