రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

మొయినాబాద్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ప్రాంతానికి చెందిన మోలా హృదయ రాజు(58) పెద్దమంగళారంలో ఉంటూ కోఠిలోని సీపీడబ్ల్యూడీ(సెంటర్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌)లో ఉద్యోగం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వస్తుండగా రాత్రి 7:30 గంటలకు మొయినాబాద్‌లోని జేబీఐటీ కళాశాల వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు కాగా, కుడిచేయి విరిగింది. వెంటనే చికిత్సకోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

వేడి నీటి సంపులో పడి వలస కార్మికుడి మృతి

షాద్‌నగర్‌: వేడి నీటి సంపులో పడి ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం నందిగామ మండలం వీర్లపల్లి శివారులోని జాగృతి స్టీల్‌ పరిశ్రమలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మాండ్లా జిల్లా గౌరాచావర్‌ తాలుకా ముర్లిటోల గ్రామానికి చెందిన ఉమేశ్‌(27) కొంత కాలం క్రితం నందిగామకు వలస వచ్చి జాగృతి స్టీల్‌ పరిశ్రమలో పని చేస్తున్నాడు. పరిశ్రమల్లో తయారైన ఇనుప చువ్వలను చల్లార్చడానికి వాడిన నీటిని సంప్‌లోకి వదులుతున్నారు. ఆ సంపులో నీరు వేడిగా ఉంటాయి. శనివారం ఉదయం విధుల్లోకి వెళ్లిన ఉమేశ్‌ సంప్‌ వద్దకు వెళ్లిన క్రమంలో ప్రమాదశాత్తు అందులో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని, సంపు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడంతోనే కార్మికుడు మృతి చెందినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement