ఇబ్రహీంపట్నం రూరల్: వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గోదాసు జంగయ్య, యశోద అనే వృద్ధ దంపతులు కొంగరకలాన్ డివిజన్‌లోని ఎస్‌బీఐ పక్కన నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భోజనం చేసి, నిద్రకు ఉపక్రమించారు. వీరు ఉంటున్న గదికి కిటికీ తలుపు, గ్రిల్స్ లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి దూరారు. నిద్రపోతున్న యశోద (70) మెడలోని బంగారు లాక్కుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. చోరీ అనంతరం పక్కనే ఉన్న పొలాల నుంచి పారిపోయినట్లు గుర్తించారు.


