సవరణకు సై | - | Sakshi
Sakshi News home page

సవరణకు సై

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

ఒక్కో చోట..ఒక్కో విధంగా..

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ వాల్యూకు.. బహిరంగ మార్కెట్లోని భూముల విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను సవరించాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతం, భూ స్వరూపం, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, బహిరంగ మార్కెట్లో ఆయా భూములు, ఇళ్లకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా వ్యాల్యూను సవరించనున్నారు. ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన నార్సింగి, కోకాపేట్‌, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో వంద శాతానికిపైగా పెరిగే అవకాశం లేకపోలేదు. రూరల్‌ ఏరియాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువ 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం లేకపోలేదు.

నాలుగేళ్ల తర్వాత మళ్లీ కదలిక..

ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల 39 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులున్నాయి. వీటిలో నెలకు సగటున 21వేల నుంచి 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతుంటాయి. ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.350 నుంచి రూ.360 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రభుత్వానికి వస్తున్న ఇన్‌కమ్‌లో అపార్ట్‌మెంట్ల నుంచి 35శాతం, ఓపెన్‌ ప్లాట్ల నుంచి 23శాతం, ఇళ్ల నుంచి 20శాతం సమకూరుతోంది. అయితే ఒక్కో ఎస్‌ఆర్‌ఓ పరిధిలో భూముల ధరలు ఒక్కో విధంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ ధరలతో పోలిస్తే.. ప్రభుత్వ మార్కెట్‌ విలువ చాలా తక్కువగా ఉంది. ఈ హెచ్చుతగ్గులను సరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2021లో భూముల మార్కెట్‌ విలువను 20శాతం పెంచుతూ అప్పటి ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2022లో 33 శాతం పెంచింది. తాజాగా మరోసారి భూ విలువను సవరించేందుకు సిద్ధమైంది. మార్కెట్‌ వాల్యూ శాసీ్త్రయంగా ఉండాలని ఓ ప్రైవేటు ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అమలుకు ఏర్పాట్లు చేస్తోంది.

భూముల మార్కెట్‌ విలువ పెంపునకు కసరత్తు

జిల్లాలో 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం

మే నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం

మరింత గడువు కావాలంటున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ

గచ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌కు సంబంధించి చదరపు అడుగు ధర ప్రస్తుతం రూ.3,000 ఉంది. దీన్ని కనీసం 60 శాతం (రూ.4,800) పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. నార్సింగి, మణికొండ, రాయదుర్గం, నానక్‌ రాంగూడ, కోకాపేట్‌, తదితర ప్రాంతాల్లోని వ్యాణిజ్య భూములు బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.వంద కోట్లకు పైనే పలుకుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లోని భూ విలువ ఆధారంగా ప్రధాన రోడ్ల వెంట గజం ధరను రూ.లక్ష వరకు పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక మహేశ్వరంలో పుస్తక విలువ రూ.2,100 మాత్రమే ఉంది. అదే వాణిజ్య స్థలం విలువ రూ.10,200 ఉంది. ఇలాంటి చోట్ల రూ.2,100 ఉన్న విలువను కనీసం రూ.3,800 నుంచి రూ. 4,500 వరకు పెరిగే ఛాన్స్‌ ఉంది. సవరించిన ఈ ధరలు మే మొదటి వారం నుంచే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుండగా, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల విభాగం మాత్రం మరికొంత గడువు కావాలని కోరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement