పిలుస్తోంది దోస్త్‌ | - | Sakshi
Sakshi News home page

పిలుస్తోంది దోస్త్‌

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

2026–27 షెడ్యూల్‌

షాద్‌నగర్‌: విద్యార్థి దశలో డిగ్రీ విద్య కీలకం.. ఏటా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నిర్వహిస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతకు సంబంధించి ఈనెల 15న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమయింది.

పాలమూరు వర్సిటీకి అనుబంధంగా..

షాద్‌నగర్‌ పట్టణంలో పాలమూరు వర్సిటీకి అనుబంధంగా అధునాత వసతులతో విశాలమైన స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించారు. స్మార్ట్‌ తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, తాగునీటి ప్లాంట్‌, సోలార్‌ ప్లాంట్‌, ఇంటర్‌నెట్‌ సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, బొటానికల్‌ గార్డెన్‌, కంపోస్టు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. కళాశాలను సందర్శించిన న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) బృందం కళాశాలకు బీ ప్లస్‌ గ్రేడ్‌ను కేటాయించారు.

కోర్సులు

● బీఏ ఇంగ్లిష్‌, తెలుగు మీడియం

● సీడీసీఎస్‌ విధానం ప్రకారం బీఏ గ్రూపులో ఆర్ట్స్‌ సబ్జెక్టులతో పాటుగా కంప్యూటర్‌ సైన్స్‌, మాథ్యమెటిక్స్‌ బోధిస్తున్నారు.

● బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌లో బొటనీ, జువాలజీ, సబ్జెక్టులతో పాటుగా కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, సెరీకల్చర్‌

● బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీతో పాటుగా కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌

● ఈ విద్యా సంవత్సరం నుంచి ఉద్యోగ భద్రత కల్పించేందుకు గాను ఇంటర్న్‌షిప్‌ సౌకర్యంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టారు.

● బీకాం రిటైల్‌ ఆపరేషన్‌, బీఎస్సీ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. ఇంటర్న్‌షిప్‌ కాలంలో స్టైఫండ్‌ ఇవ్వనున్నారు.

సులభంగా రిజిస్ట్రేషన్‌

ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌తో దోస్త్‌ వెబ్‌ సైట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సెల్‌ఫోన్‌కు వచ్చి పిన్‌ దోస్త్‌ ఐడీ ఆధారంగా సంబంధిత పోర్టల్‌లో లాగిన్‌ కావాలి. ఆసక్తి ఉన్న కోర్సును, కళాశాలను ఎంపిక చేసి ఐచ్చికాన్ని నమోదు చేయాలి. సీట్ల కేటాయింపు తర్వాత ఆన్‌లైన్‌లోనే రిపోర్ట్‌ చేస్తే సరిపోతుంది. అనంతరం నిర్ణీత తేదీల్లో కళాశాలల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

కావాల్సిన పత్రాలు

ప్రవేశాలు పొందే విద్యార్థులు ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇంటర్‌ మార్కుల మెమోతో పాటుగా 1 నుంచి 10వ తరగతి వరకు బోన్‌ఫైడ్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు, అదనపు విద్యార్హతలుంటే సంబంధిత పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తొలివిడత వెబ్‌ ఆప్షన్స్‌ 30 నుంచి.. సీట్ల కేటాయింపు మే 14న

ఈ ఏడాది నుంచి ఇంటర్న్‌షిప్‌తో కూడిన కోర్సులు

రిజిస్ట్రేషన్‌ తేదీ రుసుము వెబ్‌ఆప్షన్స్‌ సీట్ల కేటాయింపు

ఫేజ్‌–1 ఏప్రిల్‌ 15 – మే 7 రూ.200 ఏప్రిల్‌ 30– మే 8 మే 14

ఫేజ్‌–2 మే 15 – మే 25 రూ.400 మే 15 – మే 26 మే 30

ఫేజ్‌–3 మే 31 – జూన్‌ 15 రూ.400 మే 31 – జూన్‌ 16 జూన్‌ 20

Advertisement
 
Advertisement
Advertisement