ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాలు, పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇబ్రహీంపట్నం బస్ డిపోలోని సుమారు 50 అద్దె బస్సులు శుక్రవారం నడిచాయి. కండక్టర్లు లేకుండానే సగానికిపైగా బస్సులు రోడ్డెక్కాయి. సమ్మె కారణంగా డిపో ఆదాయం గణనీయంగా పడిపోయింది.
శంకర్‌గౌడ్‌కు నివాళి
సమ్మెతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌కు కార్మికులు నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ర్యాలీని నిర్వహించారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి తక్షణమే ఆర్థికసాయం అందించాలని జేఏసీ నేతలు యాదగిరి, శ్రీశైలం, అంజయ్య, టీఎస్‌రెడ్డి, కృష్ణ, జంగయ్య తదితరులు డిమాండ్ చేశారు.
హామీల అమలులో విఫలం: మాజీ ఎంపీ
సమ్మెలో ఉన్న కార్మికులకు సంఘీభావంగా మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్ డిపో వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం కావడంతోనే కార్మికులు మనస్తాపం చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తవారిని రిక్రూట్ చేసి బస్సులను నడపాలనుకుంటే.. కొత్త సీఎంను రిక్రూట్ చేయాల్సివస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్, సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్యామల, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.మహేందర్, రాఘవేంద్రస్వామి, విజయ్, నారాయణయాదవ్, టి.రాంరెడ్డి తదితరుల పాల్గొన్నారు.
కార్మికులకు సంపూర్ణ మద్దతు:
సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
సమస్యలు పరిష్కరం అయ్యేంత వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. కాంగ్రెస్ నియంతృత్వధోరణిని విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సామెల్, నర్సింహ, కిషన్, జగన్, బుగ్గరాములు, పి.కృష్ణ, శారద, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భవాని శేఖర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులసై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ జేఏసీ నాయకులు ప్రదీప్, భాస్కర్, యాదగిరి, శ్రవణ్, భరత్, వినోద్, సురేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కండక్టర్లు లేకుండానే నడుస్తున్న అద్దె బస్సులు


