● మూడు రోజుల్లో పెండింగ్ బకాయిలు
● డీఆర్‌డీఓ శ్రీలత
యాచారం: కూలీలు ఎండలకు జాగ్రత్త.. పనులు చేసే చోట నీడ, పనులకు వెళ్లేటప్పుడు సరిపడా తాగునీరు తీసుకెళ్లాలని డీఆర్‌డీఓ శ్రీలత ఉపాధి కూలీలకు సూచించారు. శుక్రవారం ఆమె గ్రామంలో కూలీలు పనిచేసే ప్రదేశాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండలకు పనులు చేయడం కష్టంగా ఉందని, పనులు చేసినా సకాలంలో బకాయిలు రాక పస్తులుంటున్నామని చెప్పారు. ఇందుకు స్పందించిన డీఆర్‌డీఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ బకాయిలు రెండు, మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ఎండల తీవ్రత పెరగుతున్నందున కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలని, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, వడదెబ్బ తగిలితే వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతి కూలీ వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచాలని, ఉదయం, సాయంత్రం పనులు చేయిస్తే కూలీలకు ఇబ్బంది ఉండదని వివరించారు. కూలీలకు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని ఈజీఎస్ నర్సరీని సందర్శించి మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, యాచారం సర్పంచ్ మస్కు అనితశరణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


