గిన్నిస్‌ రికార్డ్‌ కరాటే ప్రదర్శనకు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ రికార్డ్‌ కరాటే ప్రదర్శనకు విద్యార్థుల ఎంపిక

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

మీర్‌పేట: నగరంలో ఈనెల 26న నిర్వహించనున్న గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కరాటే ప్రదర్శనకు జిల్లెలగూడ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ద టెంపుల్‌ ఆఫ్‌ డ్రాగన్‌ ఫైటర్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఫౌండర్‌, డైరెక్టర్‌ దాసరి జితేందర్‌కుమార్‌ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను శుక్రవారం ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్‌ ప్రెసిడెంట్‌ జైపాల్‌రెడ్డి, డైరెక్టర్‌ సురేష్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రసూన తదితరులు అభినందించారు.

సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

సీఐ చొరవతో సద్దుమణిగిన వివాదం

యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తి సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొండాపురం బాబయ్య ఓ భూ వివాదంలో తన కుటుంబ సభ్యుల నుంచి రావాల్సిన డబ్బులు అందడం లేదని, వెంటనే ఇప్పించాలని గ్రామంలోని సెల్‌టవర్‌ ఎక్కాడు. తనవారి నుంచి డబ్బులు ఇప్పిస్తేనే కిందికి దిగుతానని, లేదంటే దూకుతానని హెచ్చరికలు చేశాడు. సమాచారం అందుకున్న యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అతనితో మాట్లాడారు. సీఐ హామీతో బాబయ్య సెల్‌టవర్‌ దిగివచ్చాడు. అతన్ని పీఎస్‌కు తీసుకెళ్లిన సీఐ బాబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి డబ్బులు ఇప్పించడంతో సమస్య సద్దుమణిగింది. సెల్‌ టవర్‌ ఎక్కి హంగామా సృష్టించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని బాబయ్యను మందలించి, ఇంటికి పంపించారు.

చెట్టును ఢీకొట్టిన స్కూటీ

యువకుడి దుర్మరణం

షాద్‌నగర్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎలికట్ట శివారులో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాంచందర్‌ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్‌కాలనీకి చెందిన సవాళ్ల స్వామి(23) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఫోన్‌ రావడంతో మళ్లీ వస్తాననిచెప్పి స్కూటీపై బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో ఎలికట్ట శివారులోని భారత్‌ పెట్రోల్‌పంపు సమీపంలో స్కూటీ అదుపు తప్పడి చెట్టును ఢీకొట్టింది. దీంతో స్వామి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్‌ఐ రాంచందర్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రౌడీషీటర్‌కు రిమాండ్‌

ఆమనగల్లు: ఓ వ్యక్తిని బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్‌ను పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన రౌడీషీటర్‌ నేనావత్‌ పవన్‌కల్యాణ్‌ స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తిని బెదిరించి అతని బైక్‌ను ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మున్సిపల్‌ పరిధిలోని విఠాయిపల్లి వద్ద పోలీసులను చూసిన నేనావత్‌ పవన్‌కల్యాణ్‌ బైక్‌తో పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి అనంతరం చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడిపై ఆమనగల్లు, మాడ్గుల, అఫ్జల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లలో పదికి పైగా కేసు ఉన్నాయని తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

కొడంగల్‌ రూరల్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శుక్రవారం రాత్రి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 18న మండల పరిధిలోని ప్యాలమద్ది గేటు సమీపంలో అనారోగ్య కారణంగా ఓ మహిళ కింద పడిందనే సమాచారాన్ని పోలీసులు అందుకొని 108 వాహనంలో కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మహిళను ఎవరైనా గుర్తిస్తే కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు తెలియజేయాలని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ఫోన్‌ నెంబర్‌ 87126 70046లో సంప్రదించాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement