● ఆరు తులాల బంగారు ఆభరణాలు, 61 సెల్‌ఫోన్లు, కారు, రెండు బైక్‌లు స్వాధీనం
● పరారీలో మరో నలుగురు నిందితులు
● వివరాలు వెల్లడించిన చేవెళ్ల ఏసీపీ కిషన్
చేవెళ్ల: రద్దీ ప్రదేశాల్లో చోరీలకు పాల్పడుతున్న పలువురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ బుధవారం విలేరులతో మాట్లాడుతూ.. ఈ నెల 17న షాద్‌నగర్ మండలం దూస్కల్ గ్రామానికి చెందిన జి.వెంకటయ్య శంకర్‌పల్లిలోని తన కూతురు వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. చేవెళ్ల బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలు తస్కరించారు. ఆయన వెంటనే చేవెళ్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుఽధీర్‌బాబు, చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్‌గౌతమ్, ఏసీపీ కిషన్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక క్రైం టీం పోలీసులు గాలింపు చేపట్టింది. ఈ నెల 18న రాత్రి చేవెళ్ల క్రైం టీం పోలీసుల కల్లుగప్పి పారిపోతున్న దొంగలను దాదాపు ఏడు కిలో మీటర్లు వెంబడించి మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని ప్రతాపసింగారం వద్ద గ్రామస్తుల సహకారంతో పట్టుకున్నారు. ఈ ముఠాలో బేతంపల్లి మేరీ, దేవరకొండ రేణుక, పాలేరు సుష్మిత, ఆకుల గంగయ్య, ఇద్దరు మైనర్లును అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు బేతంపల్లి రాజశేఖర్, దేవరకొండ నాగేంద్ర, చందు, ఆకుల చరణ్‌కుమార్ తప్పించుకు పారిపోయారు. పట్టుబడిన ఈ ముఠా నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలతోపాటు 61 మొబైల్ ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక కారు, టీవీఎస్ జ్యూపిటర్ స్కూటీ, బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీస్‌స్టేషన్, బెంగళూరు, ఆర్‌పీఎస్ సికింద్రాబాద్ పరిధిలోనూ నేరాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పట్టుబడిన మైనర్లను, నిందితులను ఈనెల 19న చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం దర్యాప్తు చేస్తుందన్నారు. కేసును ఛేదించేందుకు పనిచేసిన చేవెళ్ల క్రైం టీమ్ సీఐ భూపాల్‌శ్రీధర్, కానిస్టేబుల్స్ శివ, రమేశ్, ఇతర కానిస్టేబులను ప్రత్యేకంగా అభినందించారు.


