సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని పలు జాతీయ రహదారులే కాదు అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఔటర్ రింగ్‌రోడ్డు సహా హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్ 44), నాగార్జున సాగర్ రోడ్డు, విజయవాడ జాతీయ రహదారి, బీజాపూర్ జాతీయ రహదారి, శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. అనేక మంది మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయినా అధికారుల్లో చలనం కలగడం లేదు. గుంతలు తేలిన రోడ్లను పూడ్చాలనే సోయి ఉండడం లేదు. కానీ ప్రతి మూడు నెలలకోసారి ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండానే జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశమవుతుండటం హాస్యాస్పదంగా మారింది. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలుపై కనీస చర్చకూడా ఉండడం లేదు. తూతూ మంత్రంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారే కానీ.. రహదారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు లేకపోలేదు. బుధవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీ(డీఆర్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహించింది. ఆర్ అండ్‌బీ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ సమావేశానికి హజరయ్యారు. అయితే రక్షణ చర్యలపై కనీస చర్చ లేకుండానే సమావేశం ముగించారు.
యాక్షన్ ప్లాన్ లేదు.. నియంత్రణ చర్యలు లేవు
తూతూ మంత్రంగా జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం


