● తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్
● రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు
షాద్‌నగర్‌రూరల్: విద్యుత్ వైర్లకింద పెరిగిన చెట్లను నరికి వేస్తున్న కూలీ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాయపడిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులతో కలిసి గిరిజనసంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ నందనవనం కాలనీలో నివాసం ఉంటున్న రాత్లావత్ లక్ష్మణ్ రోజు కూలీ నిమిత్తం షాద్‌నగర్‌కు వచ్చాడని. మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో ట్రాన్స్ కో అధికారులు ఈ నెల 8న చేపట్టిన చెట్లు నరికే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాత్లావత్‌లక్ష్మణ్ చెట్టుపైనుంచి కింద పడి పోవడంతో తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నాడన్నారు. బాధితుడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు మాట్లాడుతూ... చెట్లు నరికివేసే సమయంలో విద్యుత్ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా పని చేయించిన కాంట్రాక్టర్ బాబుల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌పై కేసు నమోదుచేసి కాంట్రాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని లేదంటే సీఎండీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్, బాధిత కుటుంబ సభ్యులు రూప్‌సింగ్, మంగుతా నాయక్, హన్మంత్, బాలరాజు, లక్ష్మణ్, లోకేశ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


