ప్రగతి చక్రాలకు బ్రేకులు | - | Sakshi
Sakshi News home page

ప్రగతి చక్రాలకు బ్రేకులు

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

అధిక చార్జీలు వసూలు

షాద్‌నగర్‌: డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టారు. దీంతో బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌కు వెళ్లేందుకు ప్రతి రోజు షాద్‌నగర్‌ ప్రాంతం నుంచి విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. షాద్‌నగర్‌ డిపోలో నిర్విరామంగా పరుగులు తీస్తున్న బస్సులు సమ్మెతో నిలిచిపోయాయి. ఏడేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి.

బస్సులను అడ్డుకున్న కార్మికులు

సమ్మె కారణంగా కార్మికులు విధులు నిర్వహించలేదు. దీంతో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాం, తహసీల్దార్‌ నాగయ్య, ఎంవీఐ వాసు తదితరులు బస్టాండ్‌కు వెళ్లారు. ప్రవేటు డ్రైవర్లతో బస్సులను డిపో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు డిపో గేటు ఎదుట భైఠాయించి అడ్డుకున్నారు.

రోజుకు రూ.18లక్షల నష్టం

డిపోలో మొత్తం 88 బస్సులున్నాయి. ఆర్టీసీ బస్సులు 53, అద్దె బస్సులు 35. డిపోలో 340 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయితే బుధవారం కేవలం ఐదు ప్రైవేటు బస్సులను మాత్రమే నడిచాయి. ప్రతి రోజుకు ఆర్టీసీకి రూ.18లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. సమ్మె కారణంగా ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని కోల్పోతుంది.

ప్రైవేటు వాహనదారుల దోపిడీ

సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. సమ్మెను ఆసరాగా తీసుకొని ప్రైవేట్‌ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి దూరాన్ని బట్టి రూ.పది–రూ.50 వరకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సులు నడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రామానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. ప్రైవేటు వాహనాలను అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

– వేమారెడ్డి, గుర్రంపల్లి

ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికై నా ఉచితంగా ప్రయాణించే వాళ్ళం. సమ్మె కారణంగా ఆటోలు, జీపుల్లో వెళ్లాల్సి వస్తుంది. ప్రైవేట్‌ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు.

– అండాలు, లింగారెడ్డిగూడ, షాద్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement