నేడు మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నేడు మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

నేడు మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జూన్‌ 2 లోపు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ఈనెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమనగల్లు మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌ నాయక్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్‌ పదవులకు 13 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. దీంతో నలుగురు సభ్యుల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించనున్నారు. సమావేశానికి 15 మంది కౌన్సిలర్‌లతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా హాజరు కానున్నారు.

ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ సునీతారెడ్డి, వ్యవసాయాధికారిణి విద్యాధరి

ఇబ్రహీంపట్నం: రైతులందరూ జూన్‌ 2వ తేదీలోపు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేయించుకోవాలని తహసీల్దార్‌ సునీతారెడ్డి, మండల వ్యవసాయాధికారిణి విద్యాధరి కోరారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, మీ సేవ కేంద్రాల సిబ్బందికి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సమీప మీ సేవ కేంద్రాలకు భూమి పాస్‌ బుక్‌ వివరాలు, ఆధార్‌, ఓటీపీ వచ్చే ఫోన్‌తో వెళ్లి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. రైతులందరికీ తగు సలహాలు సూచనలు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఏఈఓలు శ్రవణ్‌, సృజన పాల్గొన్నారు.

చెరువు శిఖంలోని బ్లూషీట్ల తొలగింపు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: శిఖం భూముల్లో వెలుస్తున్న రియల్‌ వెంచర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిభట్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు సర్వీసు రోడు వెంట వెలుస్తున్న అక్రమ వెంచర్లపై బుధవారం ‘సాక్షి’జిల్లా ఎడిషన్‌లో ‘చెర’వులు శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు స్పందించిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నారు. జిలాన్‌ఖాన్‌ చెరువులో వెలసిన బ్లూషీట్లను తొలగించారు. పులిందర్‌వాగు సహా చెరువు కట్టను ధ్వంసం చేసిన మాట వాస్తవమేనని ఇరిగేషన్‌ అధికారులు అంగీకరించారు. వెంచర్‌ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించారు. సర్వే నంబర్‌ 123, 124, 125, 434, 439, 440, 441, 442, 443లో 24.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ జిలాన్‌ ఖాన్‌ చెరువు విస్తరించి ఉందని, ఇందులో వెంచర్‌ ఏర్పాటుకు రెవెన్యూశాఖ ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని, అదే విధంగా ఔటర్‌ సర్వీసు రోడ్డు నుంచి వెంచర్‌లోకి బీటీ రోడ్డుకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇది పూర్తిగా అక్రమమని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి స్పష్టం చేశారు. నీటి వనరులను ధ్వంసం చేస్తున్న వెంచర్‌ నిర్వహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే సంబంధిత తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement