● రిపేర్లకు సంబంధించి నివేదిక సిద్ధం చేయండి
● కలెక్టర్ నారాయణరెడ్డి
మహేశ్వరం: ప్రభుత్వ హస్టళ్లలలో మరమ్మతులుంటే విద్యార్థులకు, విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మహేశ్వరం గేటు సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలను అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలతో పాటు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలకలో రిపేర్లను గుర్తించి నివేదికను సిద్ధం చేయాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం హస్టల్‌లోని వంటశాల, మెస్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎంసెట్ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలను తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థలలో అనేక మార్పులు వచ్చాయని.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుఽలకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి కేషురామ్, తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.


