వ్యక్తుల అదృశ్యంపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తుల అదృశ్యంపై కేసు నమోదు

Apr 22 2026 8:42 AM | Updated on Apr 22 2026 8:42 AM

శంకర్‌పల్లి: ఓ వ్యక్తి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిన పోయిన సంఘటన మంగళవారం మోకిల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మహారాజ్‌పేట్‌ గ్రామానికి చెందిన మోతే పరమేశ్‌(32) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి భార్య, ఇద్దరూ కూతుళ్లు ఉన్నారు. సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన పరమేశ్‌ రాత్రి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రేషన్‌ తీసుకొస్తానని..

పహాడీషరీఫ్‌: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి సబితా ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన మిర్యాల విజయలక్ష్మి(26), రాజు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఈ నెల 20వ తేదీన రేషన్‌ కార్డు కోసం రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళుతానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్‌ సైతం స్విచ్ఛాప్‌ ఉంది. కుమార్‌, బోయ నిఖిల్‌ అనే ఇద్దరిపై అనుమానం ఉందంటూ భర్త రాజు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం

షాద్‌నగర్‌: హిందూ ధర్మరక్షణ కోసం అందరూ కృషి చేయాలని విశ్వహిందూ పరిషత్‌ క్షేత్ర సంఘటన మంత్రి సత్యం జీ అన్నారు. పట్టణంలోని కేఎన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయమని, హిందూ సంస్కృతి ప్రపంచానికి మార్గదర్శకమని అన్నారు. సమాజంలో ఐక్యత, సంస్కృతి పరిరక్షణ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంతరం పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, అందెబాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బస్వం, నాయకులు నాగిళ్ల ప్రభాకర్‌, అశోక్‌గౌడ్‌, ప్యాట అశోక్‌, శ్రీనివాసచారి, చెట్ల వెంకటేశ్‌, మంగ విజయ్‌, సుధాకర్‌, బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భాగ్యవతి, రుషికేష్‌, కొత్త సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

హిందువులు సంఘటితంగా మెలగాలి

కందుకూరు: ప్రపంచానికి శాంతి, సహనం నేర్పిన గొప్ప సంస్కృతి హిందూ ధర్మానిదే అని నిత్య అగ్నిహోత్రి, వేద పాఠశాల ఫౌండర్‌ చైర్మన్‌ శశిభూషణ సోమయాజీ అన్నారు. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు బొక్క సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సనాత ధర్మాన్ని పాటిస్తూ హిందువులందరూ సంఘటితంగా మెలగాలన్నారు. గురుకులాలను నిలబెట్టుకుని మన పిల్లల్ని భావి పౌరులుగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌, స్వదేశీ జాగరణ మంచ్‌ ప్రాంత మహిళా ప్రముఖ్‌ డాక్టర్‌ కళ్లెం స్వప్న మాట్లాడుతూ.. అందరూ ఏకతాటిపైకి రావాలని, హిందూ ధర్మంతో పాటు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలన్నారు. చిన్నతనం నుంచే మన సంస్కృతి, సంప్రదాయల గురించి పిల్లలకు నేర్పించాలన్నారు. అంతకుముందు చిన్నారులు హిందూ సంస్కృతి సంప్రదాయాలు తెలిపేలా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement