కేశంపేట: తమ భూమికి పొజీషన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ 15 ఏళ్లుగా తిరిగిన న్యాయం జరగకపోవడంతో మనస్తాపంతో వెంకటమ్మ మృతి చెందిందని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన అన్నారు. మండల పరిధిలోని కాకునూర్ గ్రామానికి చెందిన ఎర్ర వెంకటమ్మ దశదిన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సంస్కరణ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... వెంకటమ్మకు గ్రామ శివారులోని 361/ఇలో 20 గుంటల వ్యవసాయ పొలం ఉందన్నారు. ఆ భూమి ఇతరులు కబ్జాలో ఉందని, విడిపించి న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం జరగలేదని అన్నారు. దీంతో అనారోగ్యానికి గురైన వెంకటమ్మ మృతి చెందిందని పేర్కొన్నారు. వెంకటమ్మ పేరు పైన ఉన్న పట్టాభూమికి పొజీషన్ చూపించాలని ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎవరూ స్పందించలేదని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికై న స్పందించి వెంకటమ్మ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జాతీయ కన్వీనర్ బండారి లక్ష్మయ్య, రాష్ట్ర కోశాధికారి చక్రవర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మయ్య, మధు, విలాస్ పాల్గొన్నారు.
కేఎన్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు సరోజన


