కొడంగల్ రూరల్: మండుటెండలో చెమటోడ్చుతున్న ఉపాధికూలీలకు పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ ఉపాధి హామీ కూలీలకు నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాలలో టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. ఇవేమీ లేక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని ఉడిమేశ్వరం శివారులో కొనసాగుతున్న ఉపాధి పనుల్లో ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది అందించిన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సర్పంచ్ కె.శ్రీనివాస్ ఉపాధికూలీలకు అందిస్తూ జాగ్రత్తలను చెబుతున్నారు. మండల పరిధిలోని అప్పాయిపల్లి శివారులో కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల్లో చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఎండలు మండుతున్న క్రమంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, కూలీలు కలిసి కానుగ పొరకతో పని ప్రదేశంలో పందిరి మాదిరి ఏర్పాటు చేసుకుని సేదతీరుతున్నామన్నారు. ఇటీవల సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య, వైద్య సిబ్బంది అందించిన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉపాధికూలీలకు అందించారు.
●
ఫొటో క్యాప్చర్‌తో ఇబ్బంది
ఉపాధి పనుల్లో ఇటీవల ఉదయం, సాయంత్రం పని ప్రదేశంలో ఫొటో క్యాప్చర్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఫొటో అప్‌లోడ్ సమయంలో నెట్‌వర్క్ పనిచేయకున్నా, సర్వర్ బిజీగా ఉన్నా ఉపాధికూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన ఫోన్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– జనార్దన్, ఎఫ్‌ఏ, ఉడిమేశ్వరం


